IPL 2025: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన కారణంగా ఐపీఎల్ 2025ను కొంతకాలం వాయిదా వేసిన సంగతి తెలిసింది. ఆ సమయంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లారు. అందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఒకడు. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటానికి తాను ఎందుకు భారత్‌కు తిరిగి రాలేదో ఇప్పుడు ఆయన కారణం చెప్పారు.
ఆస్ట్రేలియా, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత భారత్‌కు తిరిగి రాకూడదని నిర్ణయించుకున్న కొద్ది మంది విదేశీ ఆటగాళ్లలో ఒకరు. రెండు దేశాల మధ్య తలెత్తిన పరిస్థితుల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 2025ను కొన్ని రోజులు వాయిదా వేసింది. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు తమతమ దేశాలకు తిరిగి వెళ్లడానికి అవకాశం లభించింది. లీగ్ తిరిగి ప్రారంభం కాగా.. చాలా మంది ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలతో చేరడానికి తిరిగి భారత్‌కు వచ్చారు. అయితే స్టార్క్ మాత్రం రాలేదు.

ఈ విషయమై ఆయన ఇప్పుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "నేను తీసుకున్న నిర్ణయంతో సంతృప్తిగా ఉన్నాను. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించబడిన విధానం పట్ల కూడా సంతృప్తిగాఉన్నాను. అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడికి రావడానికి సుమారు ఒక వారం ముందు నా దృష్టి రెడ్ బాల్ క్రికెట్‌పైనే ఉంది. ఆ సమయంలో నా మనస్సులో కొన్ని ప్రశ్నలు, ఆందోళనలు ఉన్నాయి. ఇది నా నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది." అని మిచెల్ స్టార్క్ పేర్కొన్నారు.
ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన హేజిల్‌వుడ్
ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సన్నాహాలు కూడా తన నిర్ణయం వెనుక ఒక కారణమని మిచెల్ స్టార్క్ వెల్లడించాడు. భద్రతా ఆందోళనలు, రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టడమే ప్రధాన కారణాలు అని చెప్పాడు. అయితే మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా జట్టు సహచరుడు జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్‌లో ఆడటానికి భారత్‌కు తిరిగి వచ్చాడు. హేజిల్‌వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ అతను తిరిగి వచ్చి ఆర్సీబీకి 18 ఏళ్ల తర్వాత మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.