డ్రెస్సింగ్ రూమ్ గోడకు పంచ్.. తీవ్రంగా గాయపడ్డ మిచెల్ మార్ష్!!

పెర్త్: తీవ్ర నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ డ్రెస్సింగ్ రూమ్ గోడకు పంచ్ ఇచ్చి తీవ్రంగా గాయపడ్డాడు. స్వీయ తప్పిదంతో తీవ్రంగా గాయపడిన 27 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్-2019లో భాగంగా జరిగిన చివరి టెస్టులో మిచెల్ మార్ష్ ఐదు వికెట్లతో సత్తాచాటిన విషయం విషయం తెలిసిందే.

మార్ష్ హాఫ్ సెంచరీ:
మిచెల్ మార్ష్ ప్రస్తుతం షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా పెర్త్ వేదికగా ఆదివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న మిచెల్ మార్ష్.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.

డ్రెస్సింగ్ రూమ్ గోడకు పంచ్:
అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో నిరాశ చెందిన మార్ష్.. తన కుడి చేతిని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గోడకు బలంగా కొట్టాడు. అనంతరం గాయంతో అతడు విలవిల్లాడిపోయాడు. జట్టు యాజమాన్యం ఆస‍్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మార్ష్ కుడి చేతికి స్కానింగ్ తీయగా.. అతని మణికట్టు చిట్లినట్లు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు జట్టు యాజమాన్యానికి సూచించారు.

గాయంపై స్పష్టత లేదు:
కుడి చేతికి గాయం అవ్వడంతో మార్ష్ ఫెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 'మిచెల్ మార్ష్ చేతికి తీవ్ర గాయమైంది. కుడిచేయి నొప్పి ఇంకా బాధిస్తుంది. ఈ టోర్నీలో మార్ష్ ఆడతాడా..లేదా తెలియదు. మార్ష్ గాయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి' అని వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

పాకిస్థాన్ సిరీస్‌కు అనుమానమే:
టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా శుక్రవారం విక్టోరియాతో తలపడనుంది. నవంబర్ 21న పాకిస్థాన్‌తో బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో మార్ష్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు గాయం కావడంతో మార్ష్ చోటు కోల్పోతే అది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఎప్పటికి గాయాలతో జట్టుకు దూరమవుతున్న మార్ష్.. ఇలా సొంత తప్పిదం కారణంగా కూడా దూరమవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications