
సిడ్నీ: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు మూడేళ్ల క్రితమే వీడ్కోలు పలికినా.. ఇప్పటి వరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. అయితే ఇక నుంచి టీ20 లీగ్‌ల్లో సైతం ఆడనని పూర్తి స్థాయిలో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం స్పష్టం చేశాడు. ఈ ఏడాది జులైలోనే ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ కూడా విరామం ప్రకటించేశాడు.
'ఇక నా క్రికెట్ కెరీర్ అయిపోయింది. నేను నా చివరి బంతి వేసాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ ఏడాది ఐపీఎల్‌లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చరించింది. దీంతో నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను.' అని చెప్పుకొచ్చాడు.
ఈ ఆసీస్ ప్లేయర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కెరీర్‌లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్సన్ పడగొట్టాడు. ఆసీస్ తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్ 2015లో తన చివరి టెస్టు, వన్డేను ఆడాడు.
ఒకానొక సందర్భంలో జాన్సన్ తనకు భవిష్యత్‌లో కోచ్ బాధ్యతలు నిర్వర్తించాలని ఉందని చెప్పాడు. నా శరీరం అనుకూలించకపోయినా.. నాలోని పోటీతత్వం ఇంకా అలానే ఉంది. నా ప్రతిభను.. మెలకువలను కోచ్‌గా నిరూపించుకోవాలనుకుంటున్నా. నేను నా బలాన్ని నమ్ముకుంటాను. నా బలమైతే ఎప్పటికీ క్రికెట్‌యే' అని చెప్పాడు.