సమయం ఆసన్నమైంది: రిటైర్మెంట్ యోచనలో మిస్బా?
హైదరాబాద్: పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అంతర్జాతయ క్రికెట్ నుంచి వైదొలగే యోచనలో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యనటలో ఉన్న పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలై సిరిస్‌ను కోల్పోవడంతో మిస్బా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న చివరి టెస్టుకు ముందు మిస్బా రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనలో మిస్బా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇక మెల్ బోర్న్‌లో జరిగిన బాక్సిండ్ డే టెస్టులో మిస్బా ఫీల్డింగ్ వ్యూహాలు పేలవంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. శుక్రవారం ముగిసిన రెండో టెస్టులో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం మిస్బా మాట్లాడుతూ వాస్తవానికి తాను ఎప్పుడో రిటైర్ కావాల్సి ఉందని కానీ, కొన్ని కారణాల వల్ల జట్టులో కొనసాగాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక సమయం ఆసన్నమైందని... రిటైర్ అవుతానని చెప్పాడు. మూడో టెస్టుకు ముందుకాని లేదా తర్వాత కానీ రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన మిస్బా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగి ఓటమిపాలైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంకో టెస్టు మిగిలి ఉండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రాణించడంతో పాకిస్థాన్ కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది.

ఆశించిన మేరకు ప్రభావం చూపని ఆటగాళ్లు
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ పరుగుల వేటలో మరోసారి తడబడింది. అయితే రెండో టెస్టులో ఆశించిన మేరకు ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీని చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ అర్ధసెంచరీలను నమోదు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఆధిక్యం
అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా 624/8 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్(165 నాటౌట్), డేవిడ్ వార్నర్(144), హ్యాండ్ స్కాంబ్(54), స్టార్క్(84) లు రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే అలౌట్
ఇక రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్థాన్ 53.2 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ జట్టులో అజహర్ అలీ (43), సర్ఫ్‌రాజ్ అహ్మద్(43) మినహా ఎవరూ రాణించకపోవడంతో పాక్ కు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీసుకోగా, లయన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఇక హాజల్‌వుడ్ రెండు వికెట్లు, బర్డ్‌కు ఓ వికెట్ దక్కింది. 165 పరుగులతో టెస్టు కెరీర్‌లో 17వ సెంచరీ సాధించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications