ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కోహ్లీ ఆట తీరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటుంటే.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం తనదైన శైలిలో విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ను తెరపైకి తెస్తూ మైఖేల్ వాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 44 బంతుల్లోనే 81 పరుగులు బాదాడు. 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 184 స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. విరాట్ కోహ్లీ మెరుపులతో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 328 పరుగులతో అగ్రస్థానానికి చేరుకుని ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ ఎక్స్ వేదికగా.. "విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్‌లో బ్యాటింగ్ చేస్తుంటే చూడటం కంటే అద్భుతం ఇంకేదైనా ఉందా?" అని పోస్ట్ చేశాడు. దీనికి మైఖేల్ వాన్ స్పందిస్తూ.. "అవును.. ఉంది, అది జో రూట్ బ్యాటింగ్ చూడటం" అని సెటైరికల్‌గా రిప్లై ఇవ్వడం విశేషం. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో మైఖేల్ వాన్ కావాలనే జో రూట్‌ను పొగుడుతూ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడటం భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

ఫ్యాన్స్ ఫైర్
గత కొన్నేళ్లుగా జో రూట్ టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే. ఎక్కువ సెంచరీలు, పరుగులు సాధిస్తూ టెస్టుల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ గత ఏడాదే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే వన్డేలు, టీ20లలో కోహ్లీ రికార్డుల దరిదాపుల్లోకి కూడా జో రూట్ రాలేడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైఖేల్ వాన్ కూడా అంతర్గతంగా కోహ్లీ గొప్పతనాన్ని ఒప్పుకున్నా.. బయటికి మాత్రం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.