IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ గా వచ్చి విఫలమవ్వడమే కాకుండా దురదృష్టవశాత్తూ రనౌట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రిషబ్ పంత్ తీరుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
వైభవ్ సూర్యవంశీని చూసి నేర్చుకో..!
ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొందని మైఖేల్ వాన్ గుర్తు చేశారు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లాగా రిషబ్ పంత్ నిర్భయంగా బ్యాటింగ్ చేయాలని ఆయన సూచించారు. "పంత్.. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలో టాలెంట్‌కు కొదువ లేదు. ఇతర దేశాల్లో అయితే నీ కీపింగ్ నైపుణ్యానికి సులభంగా చోటు దక్కేది. కానీ భారత్‌లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు క్యూలో ఉన్నారు. నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే వైభవ్ సూర్యవంశీ లాగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాలి. కేవలం 48 బంతుల్లోనే సెంచరీ బాదాలనే లక్ష్యంతో బరిలోకి దిగాలి" అని మైఖేల్ వాన్ ఘాటుగా విమర్శించారు.

రూ.27 కోట్ల ధర.. కానీ ఫలితం సున్నా!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో లక్నో ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం, రిషబ్ పంత్ వ్యక్తిగత ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో అభిమానులు, నిపుణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రిషబ్ పంత్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుంటూ ప్రయోగాలు చేయడం కంటే.. క్రీజులోకి వచ్చి బంతిని మైదానం బయటకు పంపే ప్రయత్నం చేయాలని మైఖేల్ వాన్ సలహా ఇచ్చారు.
రిషబ్ పంత్‌కు మద్దతుగా జహీర్ ఖాన్
ఓ వైపు విమర్శలు వస్తుంటే మరోవైపు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాత్రం రిషబ్ పంత్‌కు అండగా నిలిచాడు. రిషబ్ పంత్ గణాంకాలను కేవలం టెస్ట్ మ్యాచ్‌లతో పోల్చడం సరికాదని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్‌లో వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పంత్ పేరిటే ఉంది. గత పదేళ్లుగా పంత్ నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతానికి ఫామ్ అంతగా లేకపోయినా, పంత్ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. పంత్ చేయాల్సిందల్లా తన బ్యాటింగ్ ఆర్డర్‌ను స్థిరపరుచుకుని, సరైన ప్రణాళికతో ఆడటమే" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రిషభ్ పంత్ 9 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడపాల్సిన సమయంలో రిషభ్ పంత్ ఇలాంటి ఒత్తిడికి లోనవ్వడం లక్నో యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. మైఖేల్ వాన్ అన్నట్లుగా పంత్ తన పాత అగ్రెసివ్ స్టైల్‌లోకి వస్తాడో లేదో చూడాలి.