పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తీవ్ర విమర్శలు చేశాడు. బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించడం తెలివి తక్కువ నిర్ణయం అని అన్నాడు. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం పాక్‌కు అలవాటే అని, కానీ ఈ నిర్ణయం మాత్రం అన్నింటి కంటే భిన్నమైనదని తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన ఈ స్థితిలో.. టాప్ ప్లేయర్‌ను ఎవరైనా తప్పిస్తారా అని ప్రశ్నించాడు.
2022 మార్చి నుంచి స్వదేశంలో పాకిస్థాన్ ఒక్క టెస్టు కూడా విజయం సాధించలేకపోతుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు, మూడు టెస్టులకు స్టార్ క్రికెటర్లపై వేటు వేస్తూ జట్టును ఆదివారం ప్రకటించింది.

మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను పాక్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గుహ్లామ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సజీద్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది. షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ప్రకటించింది.
బాబర్ అజామ్ వంటి స్టార్ ప్లేయర్లను జట్టు నుంచి తొలగించడానికి గల కారణాలను పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో సభ్యుడు ఆకీబ్ జావేద్ వివరించాడు. విశ్రాంతి ఇచ్చామని పేర్కొంటూ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపాడు. జట్టులో స్థానం కోల్పోవడం.. ఆటగాళ్లకు మంచిదే అని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం దొరకడంతో.. ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత తిరిగి పొందడానికి సాయపడుతుందని, భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తిరిగి వస్తారని పేర్కొన్నాడు.
దీనిపై మైకేల్ వాన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ''పాకిస్థాన్ గత కొంతకాలంగా గెలవట్లేదు. అయితే సిరీస్‌లో 0-1తో వెనుకజంలో ఉన్న ఈ స్థితిలో తమ టాప్ ప్లేయర్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం పాకిస్థాన్‌కు కొత్తేమి కాదు. అయితే ఈ నిర్ణయం మాత్రం అన్నింట్లో టాప్‌గా ఉంటుంది. బాబర్ అజామ్ తనంత తాను విరామం కోరుకోకపోతే.. కచ్చితంగా ఇది పాకిస్థాన్ తెలివి తక్కువ నిర్ణయం అవుతుంది'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.