
ఆ బంతులను బ్యాన్ చేయాలంటూ:
కంకషన్ స్పెషలిస్ట్‌గా ఉన్న మైఖెల్ టర్నర్ అనే వ్యక్తి 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలంటూ ఇటీవలే అధికారుల వద్ద ప్రతిపాధన తీసుకొచ్చాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేయాలా? వద్దా? అన్న చర్చలో భాగంగా టర్నర్ ఈ విషయాన్ని ప్రస్తవించాడు. దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవ్వద్దనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. అయితే వాన్ ఈ ప్రతిపాదనను కొట్టిపారేశాడు. ఇది మరో పనికిమాలిన ప్రతిపాదనగా అభివర్ణించాడు. ప్రస్తుత ప్రపంచంలో ఏది రిస్క్ అని అనిపించినా దాన్ని మరింత ప్రమాదకరంగా చూపిస్తున్నారనడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నాడు.

సరైన నిర్ణయం కాదు:
'టర్నర్ చేసిన ప్రతిపాధన హాస్యాస్పదంగా ఉంది. బౌన్సర్లు ప్రమాదకరమని తెలిసినా జూనియర్ స్థాయి నుంచి వాటిని ఎదుర్కొనే నైపుణ్యం అలవరచుకోవాలి. జూనియర్ క్రికెట్ స్థాయిలోనే ఆటగాళ్లు తమ ఆటకు పదును పెట్టుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండర్-19లో షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలనేది సరైన నిర్ణయం కాదు. చిన్న పిల్లల స్థాయి క్రికెట్‌లో మొదటసారి మాత్రమే బౌన్సర్ ఎదుర్కొనేటప్పుడు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఆ తర్వాత సరైన అవగాహన వస్తుంది' అని మైఖేల్ వాన్ తెలిపారు.

బౌన్సర్లను ఎదుర్కోలేనప్పుడు:
'జూనియర్ స్థాయిలో నా పిల్లలు కూడా క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నారు. అంతమాత్రానా షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలని నేను చెప్పలేను. ఒకవేళ బ్యాన్ చేయాలనుకుంటే.. జూనియర్ స్థాయితో పాటు సీనియర్ స్థాయి క్రికెట్‌లో ఎప్పుడో షార్ట్ పిచ్ బంతుల్ని బ్యాన్ చేయాల్సింది. ఎందుకంటే సీనియర్ స్థాయి క్రికెట్‌లో ఇప్పటికే బౌన్సర్లు ఎదుర్కొని ఎందరో గాయాలపాలు కాగా.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి బౌన్సర్లను ఎదుర్కోలేనప్పుడు క్రికెట్ ఆడడంలో అర్థం లేదు' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్లు షార్ట్ బాల్స్ ఆడటం కూడా నేర్చుకోవాలని వాన్ అంటున్నాడు.

హ్యూజ్ మృతి:
2014లో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూజ్ షార్ట్ పిచ్ బంతికి మృతిచెందడం క్రికెట్ ప్రపంచంలో పెను విషాదంగా నిలిచిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా బౌలర్ సీన్ అబాట్ వేసిన షార్ట్ పిచ్ బంతి హ్యూజ్ మెడకు బలంగా తగిలింది. దీంతో మైదానంలోనే కుప్పకూలిన హ్యూజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఈ ఘటన అప్పట్లో విషాదంగా మారింది.
World Tour Finals: మళ్లీ నిరాశే.. రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు, శ్రీకాంత్!!


Click it and Unblock the Notifications












