
హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌పై మరోసారి భారత అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవలే కాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టు ప్రదర్శనపై తన ట్విట్టర్‌లో వ్యంగ్యంగా మైకేల్ వాన్ ట్వీట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో గురువారం హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా తక్కువ స్కోరుకే ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) దెబ్బకు 30.5 ఓవర్లలోనే భారత్ 92 పరుగులకి ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియాలోని ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. శిఖర్ ధావన్(13), పాండ్యా(16) చాహల్(18 నాటౌట్), కుల్దీప్(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో "టీమిండియా 92 ఆలౌట్... ఈ రోజుల్లో ఓ జట్టు 100 పరుగులలోపే ఆలౌట్ కావడాన్ని నేను నమ్మలేకపోతున్నా" అంటూ భారత జట్టుని ఉద్దేశించి ట్వీట్ చేశాడు.
'అసలు భారత్ జట్టును హేళన చేసే ముందు నీ జట్టు పరిస్థితి చూసుకో' అంటూ ట్వీటర్ వేదికగా సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 77 పరుగులకే ఆలౌటైన స్కోరు కార్డుని జత చేస్తూ మైకేల్ వాన్‌కు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 2016లో ఇదే న్యూజిలాండ్ జట్టు టీమిండియా చేతిలో 79 పరుగులకే ఆలౌటైన స్కోరు కార్డుని జత చేస్తూ ఇదేమీంత చెత్త ప్రదర్శన కాదని ట్వీట్ చేశాడు.