లండన్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా జరిగిన సన్నాహక మ్యాచులలో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు పటిష్ట జట్లపై సంపూర్ణ విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన భారత్.. ఆపై ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇంగ్లండ్‌తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై కేఎల్ రాహుల్ (24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక బుధవారం ఆసీస్ నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మరో 13 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (41 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీ చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2021 వార్మప్ మ్యాచుల్లో భారత్ ఆడిన తీరు అద్భుతంగా ఉందని, టైటిల్ గెలిచేందుకు టీమిండియానే హాట్ ఫెవరేట్‌గా ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. 'వార్మప్ మ్యాచుల్లో భారత్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది. భారత్ ఆడిన తీరు చుస్తే.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ గెలిచేందుకు హాట్ ఫెవరేట్‌గా భారత్ కనిపిస్తోంది' అని మైఖేల్ వాన్ బుధవారం ట్వీట్ చేశాడు. టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియాకు ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంచి నిర్ణయం తీసుకుందని వాన్ ఇప్పటికే అబిప్రాయపడ్డ విషయం తెలిసిందే.
The way India are playing the warm up games suggests they may be now Hot favourites to Win the #T20WorldCup !!!
— Michael Vaughan (@MichaelVaughan) October 20, 2021
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియానే ఫేవరేట్ అని ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా పేర్కొన్నాడు. టీమిండియాలో అటు బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు ఉన్నారని.. మ్యాచ్ విన్నర్లకు కొదవలేదని చెప్పుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా యూఏఈలో మ్యాచులు ఆడటంతో ఇక్కడి వాతావరణానికి భారత ఆటగాళ్లు బాగా అలవాటుపడ్డారని స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ.. 'మొదటి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు మంచి భాగస్వామ్యం అవసరం. మాక్సీ (గ్లెన్ మాక్స్వెల్)తో మంచి భాగస్వామ్యం నిర్మించానని నేను అనుకున్నాను. స్టోయిన్ (మార్కస్ స్టోయినిస్)తో కూడా. సరైన సమయంలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాము' అని అన్నాడు.
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఈసారి సెమీస్ చేరే జట్లను అంచనా వేశాడు. అయితే తమ జట్టుకు మాత్రం అతడు చోటు కల్పించలేదు. వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్ ఈసారి సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. 'గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్... గ్రూపు-2 నుంచి పాకిస్తాన్, భారత్ సెమీస్‌కు చేరతాయి. ఒకవేళ పాకిస్తాన్.. భారత్‌ను ఓడిస్తే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ ప్రభావం వారిపై కచ్చితంగా ఉంటుంది. అపుడు సెమీ ఫైనల్ చేరే అవకాశాలు కూడా తగ్గుతాయి' అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ చెప్పాడు.