కోహ్లీకి విలియమ్సన్ అన్నింటా సమానమే.. కేన్ భారతీయుడు అయ్యుంటేనా?! వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు!

లండన్: టీమిండియా, భారత ఆటగాళ్లపై నిత్యం విమర్శలు కురిపించే ఇంగ్లండ్ మాజీ సారథి, స్టార్ కెమెంటేటర్ మైకేల్ వాన్ మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నింటా సమానమేనని పేర్కొన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరుల సంఖ్య పరంగానే వారిద్దరికీ తేడా ఉందని పేర్కొన్నాడు. కేన్ భారత్‌లో పుట్టి ఉంటే వాణిజ్య ఒప్పందాలతో భారీగా డబ్బు సంపాదించేవాడని వాన్ చెప్పాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐపీఎల్ 2021 విషయంలో కూడా వాన్ వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

100 మిలియన్ అనుచరులు లేరంతే:
తాజాగా ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'మూడు ఫార్మాట్లు ఆడే గొప్ప ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. విరాట్ కోహ్లీకి కేన్ అన్నింటా సమానమే. కాకపోతే కేన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ అనుచరులు లేరు. ఇదొక్కటే తేడా. కోహ్లీ తరహాలో వాణిజ్య ఒప్పందాల ద్వారా 30-40 మిలియన్ డాలర్లు ఏటా సంపాదించడు. ఇక నాణ్యత, మైదానంలో అనుభవం, నిలకడ పరంగా చూస్తే.. కేన్ ఎక్కువ పరుగులు చేస్తాడు. ఉదాహరణకు 3 టెస్టుల్లో కేన్, 6 టెస్టుల్లో విరాట్‌ను పోలిస్తే. ప్రొ రేటా ప్రకారం ఈ వేసవిలో విలియమ్సన్ ఎక్కువ పరుగులు చేయగలడు' అని అన్నాడు.

కేన్ భారతీయుడైతే:
'కేన్ విలియమ్సన్ భారతీయుడైతే.. అతడే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు అవుతాడు. సోషల్ మీడియాలో మీరు ఒప్పుకోరు కాబట్టి విరాట్ కోహ్లీ గొప్ప కాదని అనను' అని గతంలో మైకేల్ వాన్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నంబర్‌వన్ టెస్టు బ్యాట్స్‌మన్ అయిన కేన్ 2020లో ఆడిన 4 టెస్టుల్లో 83 సగటుతో పరుగులు చేశాడు. 2021లో ఆడిన ఒక టెస్టులో 238 పరుగులు సాధించాడు. మరోవైపు ఐదో ర్యాంకులో ఉన్న కోహ్లీ.. 2020లో 19.33 సగటుతో పరుగులు చేశాడు. 2021లో 4 మ్యాచుల్లో 172 రన్స్ చేశాడు. సౌతాంప్టన్‌లో జూన్ 18 నుంచి జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఈ ఇద్దరు కీలకం కానున్నారు.

20 మ్యాచ్‌ల్లో 948 పరుగులు:
50 ఓవర్ల క్రికెట్‌లో కేన్ విలియమ్సన్ 2019లో 20 మ్యాచ్‌ల్లో 59.25 సగటుతో 948 పరుగులు చేశాడు. 2020లో 2 మ్యాచ్‌లు ఆడి 41 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 2019లో 59.86 సగటుతో 26 మ్యాచ్‌లలో 1377 పరుగులు చేశాడు. తర్వాతి సంవత్సరంలో 9 మ్యాచ్‌ల్లో 47.88 సగటుతో 439 పరుగులు చేశాడు. వన్డే ర్యాంకింగ్‌లో కోహ్లీ 2వ స్థానంలో ఉండగా.. విలియమ్సన్ 12వ స్థానంలో ఉన్నాడు. టీమిండియాకు కోహ్లీ 91 టెస్టులు, 254 వన్డే, 90 టీ20లు ఆడగా.. కివీస్ తరఫున కేన్ 83 టెస్టులు, 151 వన్డే, 67 టీ20లు ఆడాడు.

భారత్ vs న్యూజీలాండ్:
తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజీలాండ్ తలపడనున్నాయి. భారత్ మొత్తంగా 24 మ్యాచుల్లో 2914 పాయింట్లు అందుకొంది. మరోవైపు న్యూజిలాండ్ 18 టెస్టులాడి మొత్తం 2166 పాయింట్లు సంపాదించింది. ఇటీవల ఆసీస్‌పై 2-1, ఇంగ్లండ్‌పై 3-1 తేడాతో గెలవడం కోహ్లీసేనకు ఉపయోగపడింది. ఇక వెస్టిండీస్, పాకిస్థాన్‌పై 2-0 తేడాతో సిరీసులు గెలవడం కివీస్‌ను ముందుకు తీసుకొచ్చాయి. దక్షిణాఫ్రికా పర్యటనను ఆసీస్ రద్దుచేసుకోవడంతో.. కంగారులు టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications