IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్ సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి సీజన్ 18లో తొలి విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్‌లు ఆడింది. కానీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం విఫలమయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన రోహిత్ శర్మ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఆడాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతున్న రోహిత్ శర్మపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగడం ఇప్పుడు కొంచెం కష్టమని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ బ్యాటింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తిన మైఖేల్ వాన్
రోహిత్ పేలవ ప్రదర్శనను చూసిన మైఖేల్ వాన్ క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ .. "రోహిత్ శర్మ ఇప్పుడు ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ కాదు. రోహిత్ ఇప్పుడు కేవలం బ్యాటర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఒకసారి రోహిత్ గణాంకాలను చూడండి. ఇవే పరుగులు ఇతర ఆటగాడు ఎవరైనా చేసి ఉంటే.. ఇప్పటికే జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చేది. రోహిత్ శర్మ కాబట్టే ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు. అలాంటి అద్భుతమై ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శన సరికాదు. రోహిత్ శర్మ లాంటి ఆటగాడికి ఈ గణాంకాలు సరిపోవు. రోహిత్ ను జట్టు నుంచి తొలగించాలనేది నా అభిప్రాయం కాదు. హిట్ మ్యాన్ తిరిగి తన ఫామ్ ను అందుకోవాలి. ముంబై తరఫున కచ్చితంగా మంచి స్కోరు చేయాల్సిన అవసరం ఉంది." అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు.

మూడు మ్యాచ్‌లలో రోహిత్ ప్రదర్శన ఇదే..
సీజన్ 18లోని మూడు మ్యాచ్ ల్లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ హిట్‌మన్‌కు పెవిలియన్‌కు మార్గం చూపించాడు.అనంతరం రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 4 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మూడో మ్యాచ్ లో కేకేఆర్ పై రోహిత్ బ్యాట్ నుంచి కేవలం 13 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 21 పరుగులు మాత్రమే చేశాడు.