హైదరాబాద్: తొలి రెండు టెస్టుల్లో పరుగులు సాధించడంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాంచీలో జరిగే మూడో టెస్టులో తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం క్లార్క్ ఇండియా టుడేకు ఇంటర్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్యూలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సిరిస్‌ను తామే గెలుస్తామన్న క్లార్క్, చివరి వరకూ హోరాహోరీ పోరు ఖాయమని చెప్పాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదం సద్దుమణగడంతో ఇరు జట్లు ఇప్పుడు మూడో టెస్టుపై దృష్టి సారిస్తాయన్నాడు.
'రాంచీ టెస్టులో కోహ్లీ పరుగుల దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఇంకా ఆకట్టుకోని కోహ్లీ, మూడో టెస్టులో చెలరేగే అవకాశం ఉంది. మూడో టెస్టులో గెలుపు ఇరు జట్లకు కీలకం. అయితే మేమే సిరీస్‌ను గెలుస్తాం. ఆసీస్‌కే నా మద్దతు. వారి విజయాల్నే నేను చూడాలనుకుంటా. ఇప్పుడు కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1తో గెలిచే అవకాశం ఉంది' అని క్లార్క్ జోస్యం చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఆస్ట్రేలియా జట్టు ఎక్కువ దృష్టి సారించిందన్న వ్యాఖ్యలతో క్లార్క్ విబేధించాడు. అది కేవలం కోహ్లీ పట్ల అప్రమత్తంగా ఉండటమే తప్పితే, అతనిపై ఫోకస్ పెట్టడం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశాడు. ఇక గాయం కారణంగా మిగతా రెండు టెస్టులకు మిచెల్ స్టార్క్ దూరమైన దానిపై కూడా స్పందించాడు.
ఇది నిజంగా ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురదెబ్బేనని అన్నాడు. సిరీస్ తుదిఫలితంపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో భారత్‌పై ఆసీస్ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని క్లార్క్ వ్యక్తం చేశాడు. ఇక పూణె టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన ఆసీస్ స్పిన్నర్లు ఓకీఫ్, లియాన్‌పై క్లార్క్ ప్రశంసలు కురిపించాడు.
మార్చి 16 నుంచి రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్ల చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తేడాతో సమమైంది.