MI VS SRH: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లిపోయింది. తాజాగా జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ సీజన్ లో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. దీంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.
ఆఖర్లో కాస్త మెరుపులు..
ఈ మ్యాచులో సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 28 పరుగులు; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 19 పరుగులు) మళ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఫీల్డింగ్ లో మాత్రం ఆకట్టుకున్నాడు. అయితే ఆఖర్లో మాత్రం హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 37 రన్స్) కాసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ (8 బంతుల్లో 18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (8) కూడా కాసేపు దూకుడుగా ఆడి నాటౌట్ గా నిలిచారు. ముంబయి బౌలర్లలో విల్ జాక్స్ 2, ట్రెండ్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

హార్దిక్ దూకుడు..
ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్.. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. రియాన్ రికల్టన్ (23 బంతుల్లో 31 పరుగులు; 5 ఫోర్లు ), రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్సులు), విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (15 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సులు) మంచి ప్రదర్శనే చేశారు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య 233.33 స్ట్రైక్ రేటుతో.. 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 21 పరుగులు చేశాడు. విజయానికి 14 బంతుల్లో 2 పరుగులు అవసరమైన నేపథ్యంలో మ్యాచును సిక్స్ బాది ముగిద్దామనుకున్నాడు. కానీ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే నమన్ ధీర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. తిలక్ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
అదే మా ఓటమికి కారణం..
మ్యాచ్ అనంతరం ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. వికెట్ కష్టంగా ఉందని చెప్పాడు. తాము బ్యాటింగ్‌లో కొన్ని తక్కువ పరుగులు చేశామని పేర్కొన్నాడు. "ఈ పిచ్ అంత తేలికగా లేదు. కష్టంగా ఉంది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ సాధారణంగా వేగంగా స్కోరింగ్ చేయొచ్చని భావిస్తాం. కానీ అలా జరగలేదు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మమల్ని పూర్తిగా కట్టడి చేశారు. 160 పరుగులు సాధించినప్పటికీ అది తక్కువగానే అనిపించింది. అయితే బౌలింగ్‌లో బానే ప్రదర్శన చేశాం. వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని మేము భావించాం. డెత్ ఓవర్లలో మంచి బౌలర్లు ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఒకటి రెండు ఓవర్లు వేసేలా ప్లాన్ చేసుకున్నాం. అందుకే రాహుల్ ను పంపించాం. ఫైనల్ చేరాలంటే హోమ్ తో పాటు బయట మైదానాల్లో బాగా ఆడాలి. కానీ దురదృష్టవశాత్తు అది జరగట్లేదు. పుంజుకుని తిరిగి వస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ పరిస్థితిని అంచనా వేయడంపై మేం దృష్టి పెడతాం. మా వాళ్లు పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడారు. అనవసరమైన హిట్టింగ్ చేయలేదు. మా నెక్ట్స్ మ్యాచ్ హోం గ్రౌండ్‌లో జరగుతుంది. ఆ పిచ్ పై మాకు మంచి అవగాహన ఉంది " అంటూ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.