ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఊపులో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచులోనూ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదటగా విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 67; 8×4 2×6), రజత్ పటీదార్ (32 బంతుల్లో 64; 5×4, 4×6), జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్; 2×4, 4×6) రాణించడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరును చేసింది. లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (29 బంతుల్లో 56; 4×4, 4×6), హార్దిక్ పాండ్య (15 బంతుల్లో 42; 3×4, 4×6) పోరాడినా ముంబయికి ఫలితం దక్కలేదు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య (4/45), హేజిల్‌వుడ్ (2/37), యశ్ దయాళ్ (2/46) చెలరేగే ప్రదర్శన చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లో కృనాల్ పాండ్య మాయ చేశాడు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమైన నేపథ్యంలో.. బంతిని అందుకున్న కృనాల్ పాండ్య.. 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.
అయితే ఈ మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కు దక్కింది. మ్యాచ్ అనంతరం అతడు ఆర్సీబీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. "ఇది నిజంగా అద్భుతమైన మ్యాచ్. మా బౌలర్లు చూపిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమైనది. నిజం చెప్పాలంటే, ఈ అవార్డు (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) మా బౌలింగ్ విభాగానికే చెందుతుంది. ఈ మైదానంలో బ్యాటింగ్ యూనిట్‌ను అడ్డుకోవడం అంత సులభం కాదు, అందుకే క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. ఫాస్ట్ బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. కృనాల్ పాండ్య వేసిన బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. చివరి ఓవర్‌లో అతడు చూపిన ధైర్యం, బౌలింగ్ వేసిన తీరు అసాధారణం. ఆ సమయంలో మేము మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. అందుకే కృనాల్ ను చివరి ఓవర్ ఇచ్చాం. వికెట్ మంచి స్థితిలో ఉంది. బంతి బ్యాట్ మీదకు మంచిగా వచ్చింది. వ్రిస్ట్ స్పిన్నర్ సుయాష్ శర్మ వేసిన బౌలింగ్ చాలా గొప్పగా అనిపించింది." అని రజత్ పటీదార్ అన్నాడు.
