Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs PBKS: ముంబై ఇండియ‌న్స్‌కు ఐదో ఓట‌మి.. ఆల్‌రౌండ్‌తో షో పంజాబ్ కింగ్స్ జ‌య‌భేరి

MI vs PBKS: Fifth defeat to Mumbai Indians and Punjab kings Beat Mumbai by 12 runs

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్‌ ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు మ‌రోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ జ‌ట్టు వ‌రుస‌గా ఐదో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. చివ‌రి వ‌ర‌కు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ కింగ్స్ 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 199 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌ను ర‌నౌట్లు కొంప‌ముంచాయి. దీంతో డెవాల్డ్ బ్రెవిస్, తిల‌క్ వ‌ర్మ, సూర్య‌కుమార్ యాద‌వ్ రాణించిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఇక బ్యాటింగ్‌లో శిఖ‌ర్ ధావ‌న్, మ‌యాంక్ అగ‌ర్వాల్ హాఫ్ సెంచ‌రీలతో చెల‌రేగ‌డం.. బౌలింగ్‌లో ర‌బాడ‌, ఓడియ‌న్ స్మిత్ స‌త్తా చాట‌డంతో ఆల్‌రౌండ్ షోతో పంజాబ్ కింగ్స్ సీజ‌న్‌లో మూడో విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

నిరాశ‌ప‌రిచిన ఓపెన‌ర్లు

199 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి ముంబై ఇండియ‌న్స్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ శుభారంభాన్ని ఇవ్వలేక‌పోయారు. 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మంచి ట‌చ్‌లోనే క‌నిపించిన‌ప్ప‌టికీ రబాడ వేసిన నాల్గో ఓవ‌ర్లో 28 ప‌రుగుల వ్య‌క్తిగత స్కోర్ వ‌ద్ద వైభ‌వ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఐదో ఓవ‌ర్లో వైభ‌వ్ అరోరా బౌలింగ్‌లో జితేన్ శ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిష‌న్ (3) కూడా ఔట‌వ‌డంతో ముంబై 32 ప‌రుగుల‌కే 2 కీల‌క వికెట్లు కోల్పోయింది.

డెవాల్డ్‌ బ్రెవిస్ విధ్వంసం

ఈ క్ర‌మంలో డెవాల్డ్ బ్రెవిస్, తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ చెల‌రేగి ఆడి ముంబై ఇండియ‌న్స్‌ను ఆదుకున్నారు. ఫోర్లు, సిక్సుల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఈ క్ర‌మంలో రాహుల్ చాహ‌ర్ వేసిన 9వ ఓవ‌ర్లో వ‌రుస‌గా 4 సిక్సుల‌తో బ్రెవిస్ ఏకంగా 29 ప‌రుగుల రాబ‌ట్టాడు. తిల‌క్, బ్రెవిస్ 41 బంతుల్లోనే 84 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో ఓడియ‌న్ స్మిత్ వేసిన 11వ ఓవ‌ర్లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి బ్రెవిస్ (25 బంతుల్లో 49 ర‌న్స్‌.. 4 ఫోర్లు, 5 సిక్సులు) ఔట‌య్యాడు. దీంతో 116 ప‌రుగుల వ‌ద్ద ముంబై 3వ వికెట్ కోల్పోయింది.

కొంప‌ముంచిన ర‌నౌట్లు

ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి తిల‌క్ వ‌ర్మ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే 13వ ఓవ‌ర్లో అన‌వ‌స‌ర‌మైన ప‌రుగుకు ప్ర‌యత్నించి తిల‌క్ వ‌ర్మ (20 బంతుల్లో 36 ర‌న్స్‌.. 3 ఫోర్లు, 2 సిక్సులు) ర‌నౌట్ అయ్యాడు. అప్ప‌టికి ముంబై స్కోర్ 131గా ఉంది. ఇక చివ‌రి 4 ఓవ‌ర్ల‌లో 48 ప‌రుగులు కావాల్సిన ద‌శ‌లో సూర్య‌కుమార్ త‌ప్పిదంతో అన‌వ‌ర‌మైన ప‌రుగుకు వెళ్లిన పొలార్డు(10) ర‌నౌట్ అయ్యాడు. దీంతో ముంబై 152 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు ర‌నౌట్లు అవ్వ‌డం ఆ జ‌ట్టు కొంప‌ముంచింది.

పంజాబ్ విజ‌యం

ఈ క్ర‌మంలో సూర్యకుమార్ యాద‌వ్ జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చే ప్ర‌య‌త్నం చేశాడు. అయ‌తే చివ‌రి 2 ఓవ‌ర్ల‌లో విజ‌యానికి 28 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో ర‌బాడ వేసిన 19వ ఓవ‌ర్ నాల్గో బంతికి భారీ షాట్‌కు ప్ర‌యత్నించి సూర్య‌కుమార్ యాద‌వ్(30 బంతుల్లో 43 ర‌న్స్‌, ఒక ఫోర్‌, 4 సిక్సులు) ఔట‌య్యాడు. దీంతో ముంబై ప‌రాజ‌యం ఖ‌రారైంది. ఇక చివ‌రి ఓవ‌ర్లో విజ‌యానికి 22 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో ఓడియ‌న్ స్మిత్ 9 ప‌రుగులే ఇచ్చి 3 వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్ 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆ ఓవ‌ర్లో జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్, బుమ్రా, మిల్స్ ఔటయ్యారు. ముంబై 9 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. పంజాబ్ బౌల‌ర్ల‌లో ఓడియ‌న్ స్మిత్ 4, ర‌బాడ 2, అరోరా ఒక వికెట్ తీశారు.

చెల‌రేగిన ధావ‌న్, మ‌యాంక్‌

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్ (70), మ‌యాంక్ అగ‌ర్వాల్ (52) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించ‌డంతోపాటు ఏకంగా 97 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. మ‌ధ్య‌లో ముంబై బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. బెయిర్‌స్టో (12), లివింగ్ స్టోన్ (2) విఫ‌ల‌మ‌య్యారు. చివ‌ర్లో జితేష్ శ‌ర్మ‌(30*), షారూక్ ఖాన్ (15) మెరుపులు మెరిపించ‌డంతో చివ‌రి 3 ఓవ‌ర్ల‌లోనే పంజాబ్ 47 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో బ‌సిల్ థంపి 2, ఎం. అశ్విన్, బుమ్రా, ఉన‌ద్క‌త్ త‌లో వికెట్ తీశారు.

స్కోర్లు

పంజాబ్ కింగ్స్‌: 198-5

ముంబై ఇండియ‌న్స్‌: 186-9

Story first published: Wednesday, April 13, 2022, 23:55 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+