MI VS LSG: ముంబై వాంఖెడె స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బుమ్రా బౌలింగ్ లో రవి బిష్ణోయ్ బాదిన భారీ సిక్స్ దెబ్బకు లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అందరినీ తెగ నవ్వులు తెప్పించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం లక్నో సూపర్ జెయింట్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు కష్టంగా మారింది. అయితే బుమ్రా వేసిన తన స్పెల్ లోని ఫైనల్ బంతికి.. సహజంగా లెగ్ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ లాంగ్ ఆన్ దిశగా అసాధారణమైన భారీ సిక్స్ బాదాడు. సిక్స్ కొట్టగానే.. తాను ఏదో సాధించినట్లుగా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్లోని లక్నో జట్టు ఆటగాళ్లలో నవ్వులు విరిశాయి. మెంటార్ జహీర్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించాడు. అప్పుడే పంత్ ఏందిరా నువ్వు అన్నట్టుగా సైగ్ చేస్తూ నవ్వాడు. పైగా బౌలర్ అయిన బిష్ణోయ్ సిక్స్ కొట్టడంతో బుమ్రా కూడా కంట్రోల్ చేసుకోలేక నవ్వుతూ కనిపించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముంబై జట్టుకు వరుసగా ఇది ఐదో విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (4/22) లక్నో బ్యాటర్లను భయపెట్టాడు. ట్రెంట్ బౌల్ట్ (3/20) కూడా చెలరేగాడు. విల్ జాక్స్ 2, కోర్బిన్ బాష్ ఒక వికెట్ పడగొట్టారు. లక్నోకు 10 మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
