
అబుదాబి: ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసి.. కోల్‌కతా ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (55; 42 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (33; 30 బంతుల్లో 4x4) పర్వాలేదనిపించాడు. స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14) నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరలో కీరన్ పొలార్డ్ (21; 15 బంతుల్లో 2x4, 1x6) బ్యాట్ జులిపించే ప్రయత్నం చేశాడు. కోల్‌కతా బౌలర్లు లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ కృష్ణ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. గత మ్యాచుకు దూరమైన రోహిత్ తనదైన శైలి కాకుండా.. కాస్త ఆచితూచి ఆడాడు. సిక్సులకు పోకుండా కాస్త నెమ్మదిగా ఆడాడు. అయితే డికాక్ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఇక వేగం పెంచే క్రమంలో రోహిత్ భారీ షాట్‌కు యత్నించి కోల్‌కతా బౌలర్ సునిల్ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు. దీంతో ముంబై మొదటి వికెట్ కోల్పోయింది.
అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ అండతో క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డికాక్ 50 పరుగులు చేశాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన డికాక్‌ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కు చేర్చాడు.ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్యా (12) ఆకట్టుకోలేకపోయారు. ఇద్దరు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. హిట్టర్ కీరన్ పొలార్డ్ (21) ఫర్వాలేదనిపించినా.. దూకుడుగా మాత్రం ఆడలేకపోయాడు. కీలక సమయంలో ఔట్ అయి నిరాశపరిచాడు. దీంతో ముంబై సాధారణ స్కోరుకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. సునిల్ నరైన్ ఒక వికెట్ తీశారు. వరుణ్ చక్రవర్తి వికెట్ తీయకున్నా.. పరుగులు మాత్రం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరుణ్ చక్రవర్తి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు కోల్‌కతాపై హిట్‌మ్యాన్ 982 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. పంజాబ్ కింగ్స్‌పై 943 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్ కోల్‌కతాపై కూడా 915 రన్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 909 (ఢిల్లీ క్యాపిటల్స్) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.