
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మరో హైఓల్టేజ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను పలకరించబోతోంది. కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఢీ కొనబోతోన్నాయి. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం దీనికి వేదికగా మారింది. సెకెండ్ హాఫ్‌లో ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కోల్‌కత నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. తన పాయింట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. రెండు జట్లకూ ఇది కీలకమే.
ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్‌లల్లో కొందరు ప్లేయర్లు కొత్త రికార్డులను నెలకొల్పడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి- రోహిత్ శర్మ. అతను ఇంకో 20 పరుగులు చేయగలిగితే- ఐపీఎల్ టోర్నమెంట్‌లో 5,500 పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకుంటాడు. ఇంకో సిక్సర్‌ను బాదితే- టీ20 ఫార్మట్‌లో 400 సిక్సులను సాధించిన క్లబ్‌లో చేరతాడు. ఈ క్లబ్‌లో చేరిన మొదటి టీమిండియా ప్లేయర్ అతనే అవుతాడు. ఓవరాల్‌గా ఏడు బ్యాట్స్‌మెన్ అవుతాడు.
కాగా- ముంబై ఇండియన్స్‌కే చెందిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మరో ల్యాండ్‌మార్క్‌ను అందుకోవడానికి అవకాశం ఉంది ఈ మ్యాచ్‌తో. ముంబై ఇండియన్స్ తరఫు 50 వికెట్లను అందుకున్న వాడిగా రెండో ప్లేయర్‌గా ఆవిర్భవించే ఛాన్స్ ఉంది. దీనికోసం అతను చేయాల్సిందల్లా ఒక వికెట్ పడగొట్టడమే. ఐపీఎల్ సీజన్‌లో బ్యాటింగ్‌లో వెయ్యి పరుగులు, బౌలింగ్‌లో 50 వికెట్లను తీసుకున్న రెండో ఆటగాడు కృనాల్ పాండ్యే అవుతాడు. అతని కంటే ముందు కీరన్ పొల్లార్డ్ ఈ ఘనతను సాధించాడు.
మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఓ రికార్డ్‌ను అందుకోవడానికి చేరువ అయ్యాడు. ఇంకో అయిదు సిక్సర్లను గాని అతను కొడితే- ఐపీఎల్‌లో వంద సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్ అవుతాడు. అలాగే- కోల్‌కత నైట్ రైడర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 4,000 పరుగులకు చేరువ అయ్యాడు. ఇంకో 54 పరుగులను చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో 4000 పరుగులు చేసిన ఏడవ, ఓవరాల్‌గా 11వ బ్యాట్స్‌మెన్ అవుతాడు. కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇంకో ఎనిమిది సిక్సర్లు కొడితే- 150 సిక్సుల క్లబ్‌లో జాయిన్ అవుతాడు. ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ 81 పరుగులు చేస్తే- టీ20 ఫార్మట్‌లో 7,000 పరుగుల మార్క్‌ను అందుకుంటాడు.