MI vs GT: ఐపీఎల్ 2025లో శుభ్‌మన్ గిల్, మైదానంలోని అంపైర్ల మధ్య తీపి-చేదు సంబంధం కొనసాగింది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గిల్ అంపైర్ నిర్ణయంతో తన విభేదాలను వ్యక్తం చేశాడు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ ఆటను కొనసాగించాలనే నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ అంపైర్ కౌశిక్ గాంధీతో వాదించి బ్యాటింగ్ చేయడానికి నిరాకరించాడు. వర్షం కారణంగా ఆటలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి.
అంపైర్లతో గొడవకు దిగిన శుభ్‌మన్ గిల్
వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మంగళవారం గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. కానీ అంపైర్లు కౌశిక్ గాంధీ, సాయి దర్శన్ కుమార్ ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. వర్షం పెద్దగా ఏమీ కురవడం లేదని.. ఆటను ఆపడం అవసరం లేదని అంపైర్లు మ్యాచ్ ను కొనసాగించారు. అంపైర్లు చెప్పింది కూడా నిజమే.. ప్రారంభంలో వర్షం పెద్దగా పడలేదు. రెండో ఓవర్లోనే సాయి సుదర్శన్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. వర్షం కొంచెం ఎక్కువైంది.. కానీ అంపైర్లు ఆటగాళ్లను వెనక్కి వెళ్లమని అడగలేదు.

అప్పుడే శుభ్‌మన్ గిల్ కాస్త ఆందోళన చెందాడు. మూడో ఓవర్లో జస్‌ప్రీత్ బుమ్రాకు వ్యతిరేకంగా గిల్ జాగ్రత్తగా ఆడాడు. జోస్ బట్లర్ కూడా ఒక పరుగు మాత్రమే తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బంతి వేయడానికి పరిగెత్తడం ప్రారంభించినప్పుడు వర్షం, దుమ్ము కారణంగా గిల్ వెనక్కి తగ్గాడు. బలమైన గాలులతో కూడిన వర్షం కారణంగా బ్యాటర్ బంతిని చూడటం కూడా కష్టమైంది. శుభ్‌మన్ గిల్ అంపైర్ దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడాడు. ఆటగాళ్లను వెనక్కి పంపమని శుభ్‌మన్ గిల్ అంపైర్‌ను అభ్యర్థించాడు.
గిల్ మాట వినని అంపైర్లు
అంపైర్లు శుభ్‌మన్ గిల్ మాట వినలేదు. గిల్‌ను క్రీజులోకి తిరిగి వెళ్లమని కోరారు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట్లో నిరాకరించాడు కానీ తర్వాత నెమ్మదిగా ఆడాడు. బుమ్రా కూడా ఈ విషయంలో సంతోషంగా లేడు. తేలికపాటి వర్షం కురిసినప్పటికీ ఆట కొనసాగింది. శుభ్‌మన్ గిల్ తన విధిని అంగీకరించి అంపైర్లతో వాదించడానికి బదులుగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. పవర్ ప్లే చివరిలో వర్షం ఆగిపోయింది, కానీ 13వ ఓవర్లో మళ్లీ మొదలైంది. చివరికి 14వ ఓవర్ ముగిసే సమయానికి అంపైర్లు కవర్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయానికి గుజరాత్ స్కోరు 107/2తో శుభ్‌మన్ గిల్, షెర్పేన్ రూథర్‌ఫోర్డ్ క్రీజులో ఉన్నారు. వారు డక్‌వర్త్ లూయిస్ స్కోరు కంటే 8 పరుగులు ముందంజలో ఉన్నారు.
వర్షం కారణంగా ఆట 25 నిమిషాలు ఆగిపోయింది. కానీ ఓవర్ల సంఖ్య తగ్గించలేదు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత బుమ్రా ముంబై తరఫున అద్భుతమైన పునరాగమనం చేశాడు. బుమ్రా 43 పరుగులకు గిల్‌ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ రూథర్‌ఫోర్డ్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీని తర్వాత బుమ్రా కూడా షారుఖ్ ఖాన్‌ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో అశ్విన్ కుమార్ 2 పరుగులకే రషీద్ ఖాన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసాడు. వర్షం తర్వాత గుజరాత్ వరుసగా 4 వికెట్లు కోల్పోయింది.
జెరాల్డ్ కోయెట్జి బౌండరీ కొట్టాడు కానీ అంపైర్లు మళ్లీ కవర్స్ కోసం పిలిచారు. 18వ ఓవర్ ముగిసే సమయానికి వర్షం మరింత పెరిగింది. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం కాగా, మిగిలిన 4 వికెట్లు మిగిలి ఉన్నాయి. కానీ అసలు విషయం ఏమిటంటే వారు డీఎల్ఎస్ స్కోరు కంటే 5 పరుగులు వెనుకబడి ఉన్నారు.