ముంబైలోని వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 159పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ (39పరుగులు 33బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. రోవ్ మెన్ పావెల్ (43పరుగులు 34బంతుల్లో 1ఫోర్ 4సిక్సర్లు) కాస్త బాధ్యతగా.. కాస్త దూకుడుగా ఆడి స్కోరుబోర్డును నడిపించాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 25పరుగులే ఇచ్చాడు. ఇక డానియల్ సామ్స్, మయాంక్ మార్కండే, రమన్ దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.
ఆదిలోనే వార్నర్, మార్ష్, పృథ్వీ షా ఔటవ్వడంతో..
ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లు తమ చివరి మ్యాచ్‌లో చెలరేగిపోయారు. ప్రమాదకర ఓపెనర్ వార్నర్ (5పరుగులు) డానియల్ సామ్స్ క్యాచ్ అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న పృథ్వీ షా మాత్రం బౌండరీలతో మంచి టచ్‌లో కన్పించాడు. 4ఓవర్లో బుమ్రా మరో ప్రమాదకర బ్యాటర్ మిచెల్ మార్ష్ (0)ను గోల్డెన్ డకౌట్ చేశాడు. మళ్లీ బుమ్రా 6వ ఓవర్లో పృథ్వీ షా(24పరుగులు 23బంతుల్లో)ను కీపర్ క్యాచ్ ఔట్ చేసి ఢిల్లీని ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (10)కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో ఢిల్లీ 9ఓవర్లలో 50పరుగులకే 4వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
రిషబ్ పంత్, పావెల్ కలిసి బాధ్యతగా
ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్, హిట్టర్ రోవ్ మాన్ పావెల్ కలిసి బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును నడిపించారు. 12వ ఓవర్లో షోకీన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోరు కొట్టి స్కోరుబోర్డుకు మూమెంటమ్ తీసుకువచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ ఫోర్, సిక్సర్ కొట్టాడు. ఇక 16వ ఓవర్లో రమన్ దీప్ సింగ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒకసిక్సర్ కొట్టిన పంత్ ఆ ఓవర్ చివరి బంతికి కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. వీరిద్దరు 5వ వికెట్‌కు 75పరుగుల భాగస్వామ్యాన్ని చేశారు. ఇక చివర్లో అక్షర్ పటేల్ (19పరుగులు 10బంతుల్లో 2సిక్సర్లు) రాణించడంతో స్కోరు బోర్డు 159కి చేరుకుంది.
ఢిల్లీ ప్లేఆఫ్ చేరుతుందా లేదా..
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఈ మ్యాచ్‌ను గెలిచి గౌరవప్రదంగా ఈ సీజన్‌ను ముగించాలనుకుంటుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబై తప్పకుండా గెలవాలి. ఈ మ్యాచ్ కోసం మూడు జట్ల అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 160పరుగులను కాపాడుకుంటుందా.. లేదా ముంబైకి గెలుపు అప్పగించి టోర్నీని ప్లేఆఫ్ చేరకుండానే ముగిస్తుందా అనేది చూడాల్సిందే.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్ / కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే