IPL 2021: అందుకే హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించట్లేదు: ముంబై కోచ్

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021కు ఎంపికైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాఫిట్‌నెస్‌పై ప్రస్తుతం ఎన్నో వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా పాండ్యా బౌలింగ్ చేయకపోవడమే ఇందుకు అసలు కారణం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా.. ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో వచ్చే నెలలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో హార్థిక్ టీమిండియాలో ఎలాంటి పాత్ర పోషిస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే ఓ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌తో బౌలింగ్ చేయించేందుకు తమకు ఏం తొందరలేదని, ఒకవేళ అతణ్ని బలవంతపెడితే అది ఇబ్బందులకు దారి తీసే ప్రమాదముందన్నాడు.

ఒకవేళ బలవంతపెడితే:
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన కాన్ఫరెన్స్‌లో శుక్రవారం మహేలా జయవర్ధనే మాట్లాడుతూ... 'హార్దిక్ పాండ్యా సుదీర్ఘ కాలంగా బౌలింగ్ చేయలేదు. అతనికి ఏది మంచో అదే చేసేందుకు ముంబై మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2021లో అతడు భారత జట్టుకు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. హార్దిక్ విషయంలో భారత జట్టు యాజమాన్యంతో మాట్లాడుతూనే ఉన్నాం. అతను ఐపీఎల్‌లో బౌలింగ్ చేస్తాడా లేదా అన్నది రోజూవారీ పరిణామాల్ని బట్టి నిర్ణయిస్తాం. ప్రస్తుతం అతణ్ని బలవంతపెడితే అది తనకు ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంది. బ్యాటింగ్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది' అని అన్నాడు.

ప్లే ఆఫ్స్ చేరుతాం:
ఐపీఎల్ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తిరిగి పుంజుకుని ప్లే ఆఫ్స్ చేరేందుకు ప్రయత్నిస్తోందని మహేలా జయవర్ధనే పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యూఏఈలోని పిచ్‌లు గతేడాది కంటే భిన్నంగా ఉన్నాయని, వాటిపై పచ్చిక ఎక్కువగా ఉంటుందన్నాడు. అన్ని జట్లలోని కొందరు ప్లేయర్స్ యూఏఈలో ఐపీఎల్ 2021 ఆడుతున్నారని, ఈ అనుభవం టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా పనికొస్తుందన్నాడు. పొట్టి కప్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని మహేలా అన్నాడు. ఐపీఎల్ 2021లో ముంబై 11 మ్యాచులు ఆడి ఐదు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.

లంక పర్యటనలో బౌలింగ్ చేశాడు:
జూన్-జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుతో హార్దిక్ పాండ్యా వెళ్లాడు. ఈ పర్యటనలో హార్దిక్ బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో మాత్రమే హార్దిక్ బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. జట్టును ప్రకటించిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. హార్దిక్ బౌలింగ్ చేయడానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. అయితే ఐపీఎల్ 2021 రెండవ దశ మొదటి మ్యాచ్‌లో ఆడలేదు. ఆపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు కానీ బౌలింగ్ చేయలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అజేయంగా 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచులోనూ బౌలింగ్ చేయలేదు.

చివరిసారి అదే:
టీ20 ప్రపంచకప్ 2021లో హార్దిక్ పాండ్యా చాలా కీలకం అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా పేర్కొన్నాడు. జట్టులో అతడు కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ మొదట బ్యాట్స్‌మన్ అనే విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలని వీరూ సూచించాడు. ఐపీఎల్ 2020 ముందు హార్దిక్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపై కొంతకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. అయితే జట్టులోకి వచ్చినా.. బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు.ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో తిరిగి బౌలింగ్ చేశాడు. అంతకుముందు అదే జట్టుతో వన్డేలోనూ బంతులేశాడు. హార్దిక్ బంతులులేయడం అదే చివరిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications