వాంఖడే వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు.
ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో, 5x4) సెకండ్ టాప్ స్కోరర్. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. విజయంలో ధోనీ, పతిరన కీలక పాత్ర పోషించారని రుతురాజ్ పేర్కొన్నాడు. ఆఖర్లో ధోనీ ధనాధన్ సిక్సర్లు తమకు ఎంతో మేలు చేసిందని తెలిపాడు. తన స్థానంలో ఓపెనర్‌గా అజింక్య రహానె రావడానికి గల కారణాలు వివరించాడు. ముంబై మ్యాచ్‌లో రుతురాజ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
''ఆఖర్లో మా యువ వికెట్ కీపర్ (ధోనీ) సాధించిన మూడు సిక్సర్లు మాకెంతో సాయం చేశాయి. అవే ముంబైపై పైచేయి సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. వాంఖడే వేదికపై ఇలా 10-15 ఎక్స్‌ట్రా రన్స్ చేయడం చాలా అవసరం. మిడిల్‌లో బుమ్రా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇక ముంబై బ్యాటర్లు కొన్ని గొప్ప షాట్లు ఆడినప్పటికీ మా ప్రణాళికను బౌలింగ్‌లో అమలుచేయాలని భావించాం. మేం పవర్‌ప్లేలో 60 పరుగులు సమర్పించుకన్నాం''
''వాంఖడేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో మన మార్క్‌ను చూపించాలి. మా మలింగ (పతిరన) గొప్పగా బౌలింగ్ చేశాడు. యార్కర్లతో అదరగొట్టాడు. తుషార్, శార్దూల్ కూడా సత్తాచాటారు. ప్రతిఒక్కరిని ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగడమే మా ప్రణాళిక. అజింక్య రహానెకు కాస్త గాయమైంది. అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపాలని భావించాం. నేనే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సౌకర్యంగానే ఉంటాను. అంతేగాక సారథిగా నాపై అది మరింత బాధ్యత పెంచుతుంది'' అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.