వాంఖడే వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో, 5x4) సెకండ్ టాప్ స్కోరర్. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ధోనీ ధనాధన్ బ్యాటింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 19 ఓవర్లకు చెన్నై స్కోరు 180/3 మాత్రమే. కానీ 20వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 26 పరగులు వచ్చాయి.
అయితే హార్దిక్ బౌలింగ్‌లో ధోనీ మొదటి బంతినే సిక్సర్‌గా మలచడంతో స్టేడియం దద్దరిల్లింది. మరోవైపు ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఆ సమయంలో నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ధోనీ సిక్సర్‌ను నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. కాగా, హార్దిక్ మీద ఉన్న కోపంతోనే ప్రత్యర్థి బ్యాటర్ ధోనీ సిక్సర్లు బాదినా రోహిత్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ మనసులో కెప్టెన్సీ మార్పు గొడవ ఇంకా ఉందని అంటున్నారు.
మరోవైపు హార్దిక్‌పై అసూయతో రోహిత్ నవ్వలేదని, ధోనీ అంటే అందరికీ అభిమానమని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్‌ను కాదని, హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో రోహిత్-హార్దిక్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.