MI VS CSK: ఐపీఎల్-2025లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఘన విజయాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో రోహిత్ శర్మ (45 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సులు), 226 స్ట్రైక్ రేటుతో సూర్య కుమార్ యాదవ్ (30 బంతుల్లో 68; 6 ఫోర్లు, 5 సిక్సులు) కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా సూర్యకుమార్ అద్భుతంగా సిక్స్ బాది మ్యాచును ముగించాడు. కాగా, ముంబయికిది నాలుగో విజయం కాగా, చెన్నైకిది ఆరో ఓటమి
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (53*), శివమ్ దూబే (50) అర్ధ శతకాలతో రాణించారు. ఆయుష్ మాత్రే (32), షేక్ రషీద్ (19), ఓవర్టన్ (4*) పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ (4), రచిన్ రవీంద్ర (5) నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా రెండు, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కొత్త కుర్రాడు అదుర్స్..
గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బరిలోకి దిగిన 17 ఏళ్ల ఆయూష్ మాత్రే.. తన అరంగేట్ర మ్యాచులోనే భారీ షాట్లతో అలరించాడు. రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు బాది 32 పరుగుల చేశాడు. ఈ క్రమంలోనే చాహర్ బౌలింగ్‌లో శాంట్నర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
ఆ ఇద్దరు కలిసి..
జడేజా, శివమ్ దూబే కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించారు. దూబే 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరు సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగారు. కానీ బుమ్రా వీరిద్దరిని విడదీశాడు. దూబే ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ కూడా నిరాశపరిచాడు. చివరి బంతి వరకు జడేజా క్రీడులో ఉండి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
