
చెన్నై: కట్టుదిట్టమైన బౌలింగ్‌కు బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తోడవడంతో.. ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కోహ్లీసేన 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో నయా సంచలనం హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో అల్లాడించగా.. బ్యాటింగ్‌లో రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ దంచికొట్టడంతో బెంగళూరు సునాయాస విజయం సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే ముంబై తన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో అర్ధ శతకం చేజార్చుకోగా.. స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (31), ఇషాన్ కిషన్ (28) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ (5/27) అదరగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. డివిలియర్స్ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లీ (33) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, జాన్‌సెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.
తొలి మ్యాచులో నమోదైన గణాంకాలు ఇవే:
# ఐపీఎల్‌లో సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడడం ముంబైకిది వరుసగా తొమ్మిదోసారి. 2013 నుంచి ఒక్కసారి కూడా ఆ జట్టు తొలి మ్యాచ్ గెలవలేదు. గతేడాది చెన్నై, ఇప్పుడు బెంగళూరు చేతిలో ఆ జట్టు తొలి మ్యాచ్ ఓడింది.
# బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ 5 వికెట్లు తీసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబైపై 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2009లో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడినప్పుడు ముంబైపై నాలుగు వికెట్లు తీశాడు.
# ఆర్‌సీబీ తరఫున ఐదు వికెట్ల మార్క్ అందుకున్న మూడో బౌలర్ హర్షల్ పటేల్.
# బెంగళూరు లాస్ట్ బాల్ వరకు ఆడి లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2012లో పుణే వారియర్స్‌పై మాత్రమే ఇలా జరిగింది.
# విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌తో టీ20 ఫార్మాట్‌లో 6వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయి అందుకున్న తొలి కెప్టెన్ కూడా కోహ్లీనే.
# ఐపీఎల్‌లో చివరి బంతిపై ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది ఐదవసారి.
# యుజ్వేంద్ర చహల్‌కు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్.
# ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన 33 పరుగులతో (2753) ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాబిన్ ఉత్తప్ప (2724) పేరిట ఉండేది.