అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) టోర్నీలో ఎంఐ న్యూయార్క్ అదరగొట్టింది. ఛాలెంజర్స్ గేమ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఎంఐ.. ఫైనల్‌లో కూడా చెలరేగింది. ముఖ్యంగా కెప్టెన్ నికోలస్ పూరన్ (135 నాటౌట్) అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూయార్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సియాటెల్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (87) అద్భుతంగా ఆడాడు. అలాగే మరో బ్యాటర్ శుభమ్ రంజనే (29), డ్వెయిన్ ప్రిటోరియస్ (21) ఫర్వాలేదు అనిపించారు. కానీ మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇలా మిగతా బ్యాటర్లు అందరూ ఫెయిల్ అవడంతో సియాటెల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఎంఐ బౌలర్లలో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఛేజింగ్‌కు వచ్చిన ఎంఐకి శుభారంభం దక్కలేదు. స్టీవెన్ టేలర్ (0) డకౌట్ కాగా.. షాయన్ జహంగీర్ (10) కూడా విఫలమయ్యాడు.
అయితే వన్ డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై ప్రతాపం చూపించిన అతను.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మ్యాచ్ ముగిసే సమయానికి కేవలం 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి డెవాల్డ్ బ్రెవిస్ (20), టిమ్ డేవిడ్ (9) మంచి సహకారం అందించారు.
పూరన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉండటం గమనార్హం. అతని విధ్వంసానికి సియాటెల్ బౌలర్ల వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో కేవలం 16 ఓవర్లలోనే ఎంఐ టీం లక్ష్యాన్ని చేధించి ఎంఎల్‌సీ ట్రోఫీ అందుకుంది. సియాటెల్ బౌలర్లలో కెప్టెన్ పార్నెల్, ఇమాద్ వసీం చెరో వికెట్ మాత్రమే తీసుకున్నారు.