విదేశీ ప్లేయర్..
ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్న ఓ విదేశీ ప్లేయర్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అతనితో పాటు మరొకరికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీనితో జట్టు మొత్తం ప్రస్తుతం క్వారంటైన్‌లోకి వెళ్లింది. ఇవ్వాళ్టి తన షెడ్యూల్‌ను రద్దు చేసుకుంది. ఆ ఇద్దరు ప్లేయర్ పేరు, ఇతర వివరాలు తెలియరావట్లేదు. ఈ ఉదయం వారిద్దరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తేలింది. ఫలితంగా- జట్టు ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్.. మొత్తం తాము బస చేసిన హోటల్‌లోనే క్వారంటైన్‌లోకి వెళ్లారు.
తరువాతి మ్యాచ్‌పై అనుమానాలు..
షెడ్యూల్ ప్రకారం.. ఇవ్వాళ ఢిల్లీ కేపిటల్స్ టీమ్- పుణేకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఐపీఎల్ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తన తదుపరి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది రిషభ్ పంత్ టీమ్. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఎల్లుండి ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. దీనికోసం ఢిల్లీ కేపిటల్స్ టీమ సన్నద్ధం కావట్లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం.. కనీసం మూడు రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉన్నందున- ఆ మ్యాచ్ ఉంటుందా? లేదా అనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయి.
క్యాన్సిల్ ఐపీఎల్..
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాల పట్ల చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అభిమానులు పండగ చేసుకుంటోన్నారు. క్యాన్సిల్ ఐపీఎల్ (Cancel IPL) అనే ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తోన్నారు. వెంటనే ఐపీఎల్‌ను రద్దు చేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పోస్టులు పెడుతున్నారు. ఫోర్త్ వేవ్ ఆరంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నుంచి కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదని సలహా ఇస్తోన్నారు. ప్లేయర్ల ప్రాణాలను దృష్టిలో ఉంచుకోవాలంటూ సూచిస్తోన్నారు.
అట్టర్ ఫ్లాప్..
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. చెన్నై టీమ్ ఆరింట్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ పరిస్థితి మరీ దారుణం. ఆరింట్లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. అవమానకంగా 10వ స్థానానికి పరిమితమైంది.
90 శాతం పెరుగుదల..
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,985 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 214 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా నమోదైంది. చెప్పుకోవడానికి 2,183 కొత్త కేసులే రికార్డయినప్పటికీ- పెరుగుదల తీవ్రతకు అది అద్దం పడుతోంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారం నాటితో పోల్చుకుంటే కొత్త కేసులు రెట్టింపు అయ్యాయి.


Click it and Unblock the Notifications












