Big Bash League: కెప్టెన్ నిర్ణయమే కొంప ముంచింది.. బ్రిస్బేన్ హీట్ చిత్తు!

బిగ్ బ్యాష్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఛేజింగ్ చేస్తున్న జట్టే ఓటమిపాలైంది. మెల్‌బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ జట్టు టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ జిమ్మీ పీర్సన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామన్నాడు. ఈ నిర్ణయమే బ్రిస్బేన్ జట్టు కొంప ముంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ జట్టు భారీ హిట్టింగ్ చేసింది. ముఖ్యంగా ఆ జట్టు సారధి నిక్ మ్యాడిన్సన్ (49 బంతుల్లో 87) దంచి కొట్టాడు.
కెప్టెన్‌కు తోడుగా ఆండ్రూ రస్సెల్ (35), శామ్ హార్పర్ (21) కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో మెల్‌బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్లు జోష్ బ్రౌన్ (7), బ్యాక్స్ బ్రయాంట్ (0) ఇద్దరినీ అకీల్ హొస్సేన్ పెవిలియన్ చేర్చాడు. ఇక అక్కడి నుంచి బ్రిస్బేన్ ఇన్నింగ్స్ ఎంత తేడాతో ఓడిపోతారన్న వైపే సాగింది తప్ప.. ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు.
క్రీజులో కుదురుకున్నాడని అనుకున్న కోలిన్ మున్రో (35) రనౌట్ అవడంతో ఆ జట్టు విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చివర్లో కెప్టెన్ జిమ్మీ పీర్సన్ (43) కొంత ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం? అతనికి సహకారం అందించే బ్యాటర్లే లేకపోయారు.
రాస్ వైట్లీ (28 నాటౌట్) ధాటిగా ఆడినా జిమ్మీని కూడా అకీల్ హొస్సేన్ అవుట్ చేయడంతో బ్రిస్బేన్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి బ్రిస్బేన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెల్‌బోర్న్ కెప్టెన్ మ్యాడిన్సన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications