బాసిల్ థంఫీపై మెక్ గ్రాత్ ప్రశంసలు
భారత్‌లో యువబౌలర్స్ సత్తా చాటుతున్నారని, భవిష్యత్తులో భారత్‌కు బలమైన పేస్ బౌలర్లు అందుబాటులోకి వస్తారని థంపీని ఉద్దేశించి మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు. మెక్‌గ్రాత్ డైరెక్టర్‌గా ఉన్న ఎమ్ఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన బాసీల్ థంపీ, అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరిలు దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ ఏ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.
ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు
అకాడమీ శిక్షణలో రాటు దేలిన థంపీ ఐపీఎల్లో సత్తాచాటి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలిచుకున్నాడని ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ గుర్తు చేశాడు. ఇదే ఈ అకాడమీలో ట్రైనీగా చేరి డైరెక్టర్‌గా సేవలందించడం సంతోషంగా ఉందని మెక్ గ్రాత్ తెలిపాడు. రాబోయే రోజుల్లో మరింత మంది పేస్ బౌలర్లను భారత్‌కు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో మెరుగులు
'భారత పేస్ బౌలింగ్ ఇప్పుడు చాలా మెరుగ్గా కనిపిస్తోంది. బాసిల్ థంపి లాంటి ప్రతిభావంతులైన బౌలర్లు భవిష్యత్‌లో జట్టుకు ఉపయోగపడతారు. ముఖ్యంగా ఐపీఎల్లో అతని ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. వర్ధమాన ఆటగాడి అవార్డు అందుకున్న థంపీ ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకున్నాడు' అని మెక్ గ్రాత్ తెలిపాడు.
ఒకప్పుడు డెన్నిస్ లిల్లీ ఫౌండేషన్‌లో నేనూ శిక్షణ తీసుకున్నా
'ఒకప్పుడు డెన్నిస్ లిల్లీ ఫౌండేషన్‌లో నేనూ శిక్షణ తీసుకున్న వాడినే. కానీ ఇప్పుడు డైరెక్టర్‌గా ఉన్నా. భారత్‌లో పేస్ బౌలర్లకు ఉన్న ఈ అకాడమీ వల్ల ఎంతో మంది యువ ఆటగాళ్లకు మేలు జరుగుతుంది. యువ పేసర్లతో అనుభవాన్ని పంచుకోవడం గొప్పగా అనిపిస్తోంది' అని మెక్‌గ్రాత్ చెప్పాడు. ఐపీఎల్ 10 సీజన్లో గుజరాత్ లయన్స్ జట్టు తరుపున ఆడిన థంఫీ 11 వికెట్లు తీశాడు.