మెల్బోర్న్: ఐసిసి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో తమకు భారత క్రికెట్ అభిమానుల మద్దతు కావాలని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కుల్లం కోరారు. ఈ మేరకు ఆయన భారత క్రికెట్ అభిమానులకు ఓ లేఖ రాశారు. ఆదివారంనాడు ఫైనల్‌లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు ఓటమిని చవి చూడలేదు. వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. మెల్నోర్న్‌లో జరిగే సహ ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే తొలిసారి కివీస్ ప్రపంచ కప్ టైటిల్‌ు అందుకుంటుంది.
కివీస్ సెమీ ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆస్ట్రేలియా భారత జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచులో భారత్ లేకపోవడంతో తమకు మద్దతు ఇవ్వాలని మెక్‌కుల్లం భారత క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

స్పోర్ట్స్ వియర్ బ్రాండ్ పూమా విడుదల చేసిన లేఖలో మక్‌కుల్లం - తాము విజయం సాధించడానికి భారతదేశానికి చెందిన బిలియన్ గొంతులు కావాలని అన్నాడు. భారతదేశానికి ప్రతి క్రికెట్ అభిమానికి అంటూ లేఖను ప్రారంభించి, ప్రపంచ కప్ కోసం ఉండే దాహాన్ని మీరు అర్థం చేసుకోగలరని అన్నాడు.
ఇప్పటికే తమకు మీ మద్దతు హవాను చూశామని అన్నాడు. "మీకందరికీ కృతజ్ఞతలు, మాకు మీ ప్రతి మద్తతు కావాలి, అన్ని విధాలా ఫైనల్ మ్యాచులో ప్రతి బంతికీ మీ మద్దతు మాకు కావాలి" అని అన్నాడు. "మాకు ఇది అతి పెద్ద ఆట, మీ బిలియన్ గొంతులు మా వైపు ఉంటే తప్పకుండా లెక్కలోకి వస్తాయి" అని అన్నాడు.