
హైదరాబాద్: ఒలింపిక్స్ అంటేనే అదొక క్రీడా సముద్రం లాంటిది. అన్ని రకాల క్రీడల పోటీలు జరగడానికి అదొక చక్కని వేదిక. కానీ, క్రికెట్ అభిమానులకు మాత్రం అదొక నిరుత్సాహపరిచే విషయమే. అందుకుని క్రికెట్ కూడా జోడిద్దామని అన్ని దేశాలు ఆలోచిస్తుంటే బీసీసీఐ మాత్రం ససేమిరా నేనొప్పుకోను అంటుంది.
భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి 20కి పైగా దేశాల్లో మంచి ఆదరణ ఉన్న క్రికెట్ ఒలింపిక్ క్రీడా సంబరంలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎప్పుడూ లేదనేమీ కాదు. 1900 ఒలింపిక్స్‌లోనే ఈ ఆటకు చోటుంది.
తర్వాత ఈ ఆటను తప్పించారు. మళ్లీ క్రికెట్‌ను ఆ మెగా టోర్నీలో చేర్చే ప్రయత్నాలు గట్టిగా జరగట్లేదు. ఐతే కొన్నేళ్లుగా ఈ దిశగా ఐసీసీ ప్రయత్నం చేస్తున్నా. అన్ని బోర్డులూ కలిసి రావట్లేదు. ఇప్పుడు ఐసీసీలోని మిగతా సభ్యదేశాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఆహా మీరందరూ ఒప్పుకుంటే నేనొప్పుకోవాలా అనే తీరులో బీసీసీఐ అడ్డు పడుతుంది. దాంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేకపోతోంది.
అసలు కారణం ఇదే: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడానికి అంగీకరిస్తే.. తాము స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతామని, ఐఓసీ పరిధిలోకి రావాల్సి ఉంటుందని, దాని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో బీసీసీఐ ఈ ప్రతిపాదనను ముందు నుంచి వ్యతిరేకిస్తోంది.
ఈ విషయమై ఐసీసీ, మిగతా బోర్డులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ కలిసి వస్తే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడానికి అభ్యంతరాలేమీ లేవంటూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కూడా స్పష్టం చేయడం విశేషం. దీనిపై తాజాగా ఎంసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం కమిటీ ఛైర్మన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ గ్యాటింగ్ స్పందించాడు.
'ఇది తీవ్ర అసహనం కలిగించే విషయం. ఒలింపిక్స్‌లోకి క్రికెట్ చేర్చే విషయమై బీసీసీఐ కలిసి రావాలని వేడుకుంటున్నాం' అని గ్యాటింగ్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.