
ముంబై: టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబెలపై చర్యలు తీసుకొనేందుకు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సిద్ధమవుతోందని సమాచారం తెలుస్తోంది. ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఏ అధికారి అనుమతి లేకుండానే రైల్వేస్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రేయస్, దూబెలు విశ్రాంతి తీసుకున్న కారణంగా ఎంసీఏ చర్యలు తీసుకోనుందట. రైల్వేస్ మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయంను ఎదుర్కొంది. ఈ ఓటమిని అవమానకరంగా భావించిన ఎంసీఏ.. చర్యలు తీసుకోవాలని భావిస్తోందట.
ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్‌లు ఆడారు. ముగ్గురు కూడా సెలెక్టర్ల అంచనాలను అందుకున్నారు. వెస్టిండీస్ సిరీస్ అనంతరం లంక సిరీస్‌కు సమయం ఉందాంతో.. కొందరు భారత ఆటగాళ్లు రంజీ మ్యాచ్‌లలో ఆడుతున్నారు. అయితే రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఠాకూర్ ఆడినా.. శ్రేయస్, దూబెలు విశ్రాంతి తీసుకున్నారు. ఎవరి సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారని వారిని ఎంసీఏ అధికారులు ప్రశ్నించగా.. సెలక్టర్లని సమాధానం ఇచ్చారట.
మరోవైపు బీసీసీఐ, సెలక్టర్లు, ఫిజియో ఎవరి నుంచీ సమాచారం అందలేదని ఎంసీఏ అధికారులు అంటున్నారు. అంతేకాదు సొంతంగా నిర్ణయం తీసుకొని బోర్డు పరువు తీస్తారా అని మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలను సెలక్టర్లు సహా ఎంసీఏ కూడా అంగీకరించదని పేర్కొంటున్నారు. త్వరలో జరిగే సర్వోన్నత మండలి సమావేశంలో కచ్చితంగా ఈ విషయంపై చర్చిస్తాం. ఆపై చర్యలు తీసుకుంటామని ఎంసీఏ అధికారులు అంటున్నారు.
ఏక్‌నాథ్ సోల్కర్, సుధాకర్ అధికారి వంటి క్రికెటర్లు తమ జీవితంలో కీలకమైనవి వదిలేసి మరీ ముంబై క్రికెట్ జట్టుకు సేవ చేశారని.. అలాంటిది మీరు అనుమతి లేకుండానే విశ్రాంతి తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. మరి భారత జట్టులో శ్రేయస్, దూబెలు కీలక ఆటగాళ్లు కాబట్టి బీసీసీఐ ఈ చర్యలపై ఏవిధంగా స్పదిస్తుందో చూడాలి. వెస్టిండీస్ పర్యటనలో శ్రేయస్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. మరోవైపు దూబె కూడా కీలక సమయంలో హాఫ్ సెంచరీ చేసాడు.