ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన యువరాజ్ సింగ్ తీసుకున్న మొత్తం కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి ఆల్ రౌండర్ పవన్ నేగీని ఢిల్లీ డేర్‌డేవిల్స్ కొనుగోలు చేసింది. అయితే, తాను ఐపిఎల్‌లో తగిన ప్రతిభ కనబరచకపోవడం తన తప్పు కాదని పవన్ నేగీ అంటున్నాడు. ఇటీవలి ఐపీఎల్ 2016 పోటీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిందని అతను చెప్పాడు
ఎనిమిదిన్నర కోట్ల రూపాయలిచ్చి కొన్న పవన్ నేగీ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీకి పెద్దగా సాధించి పెట్టిందేమీ లేదు. 14 మ్యాచుల్లో 8 మ్యాచ్‌లు ఆడిన నేగీ ఒకే ఒక వికెట్ తీశాడు. 57 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇలా జరగడానికి కారణం తాను కాదని అంటున్నాడు. తన శక్తి సామర్థ్యాలను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తక్కువగా అంచనా వేసిందని, బెంచ్‌లకే పరిమితం చేసిందని చెప్పాడు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు తనలో ఉన్న ఉత్సాహాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఐపీఎల్ ముగిసే సరికి నీరుగార్చిందని ఆరోపించాడు. సన్ రైజర్స్ తరపున ఆడిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు ఇచ్చిన మొత్తం కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే. అంటే పవన్ నేగీ కన్నా కోటిన్నర తక్కువ. సన్ రైజర్స్ కప్ కూడా గెలుచుకుంది.

నేగీ మొత్తం టోర్నమెంట్‌లో 9 ఓవర్లు మాత్రమే వేశాడు. ఆసియన్ ఏజ్‌తో నేగీ తన ఆవేదనను పంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహీ బాయ్ తన సామర్థ్యాన్ని గుర్తించాడని, బ్యాటింగులోనూ బౌలింగులోనూ తన సామర్త్యాన్ని ఢిల్లీ గుర్తించలేదని అన్నాడు. తనను డ్రాప్ చేస్తున్నట్లు కూడా తనకు ఎప్పుడూ చెప్పలేదని అన్నాడు.
తాను ఆడుతానో ఆడనో కూడా తనకు ప్రతి మ్యాచు ముందు కూడా తెలిసేది కాదని చెప్పాడు. ఎందుకు సరిగా ఆడలేదని అందరూ అడుగుతున్నారని, తాను సమాధానం చెప్పలేకపోతున్నానని అన్నాడు. బెంచీ మీద కూర్చోవడాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమని అన్నాడు. మానసికంగా కుంగిపోయానని, అయితే ఆశను మాత్రం చంపుకోలేదని చెప్పాడు.