టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. మంచినీళ్లుగా భావించి విమానంలో హానికర ద్రవం తాగడంతో అనారోగ్యపాలయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరిలించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని, ఆటకు సన్నద్ధమవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మయాంక్ అగర్వాల్ చెప్పాడు.
ఆస్పత్రి బెడ్‌పై ఉంటూ థంబ్స్ అప్ సింబల్‌తో మయాంక్ అగర్వాల్ ఫొటోకి ఫోజు ఇచ్చాడు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. 'ప్రస్తుతం బాగానే ఉన్నాను. రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్ధతుకు ధన్యవాదాలు' అంటూ మయాంక్ రాసుకొచ్చాడు. కాగా, ఇవాళ సాయంత్రం మయాంక్ డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు వెళ్లి అక్కడ మరో ఆస్పత్రిలో చేరనున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే.. రంజీట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడటం కోసం కర్ణాటక జట్టు త్రిపుర రాజధాని అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. మంచినీళ్లుగా భావించి తన సీటు ఎదురుగా ఉన్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగాడు. ఆ తర్వాత అతడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు.
వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి వచ్చింది. హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంగళవారం రాత్రి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.
అయితే ఈ ఘటనపై ఆస్పుత్రి నుంచి తన మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై త్రిపుర ఆరోగ్యశాఖ కార్యదర్శి కిరణ్ గట్టె స్పందించారు. మాయాంక్‌ను ఎమర్జెన్సీలో చేర్చించి చికిత్స అందించామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
కాగా, మయాంక్ అగర్వాల్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు రోజులు పడుతుంది. దీంతో సూరత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రైల్వేస్ మ్యాచ్‌కు అతడు దూరమవున్నాడు. అతడి స్థానంలో కర్ణాటక జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నికిన్ జోస్ అందుకుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక రెండు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌ను 'డ్రా'గా ముగించింది. గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, భారత్ తరఫున మయాంక అగర్వాల్ 21 టెస్టులు, అయిదు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 41 సగటుతో 1488 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.