హైదరాబాద్: భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన పట్ల అభిప్రాయాన్ని మార్చుకుంటాడని పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ అమీర్ అన్నాడు. గతేడాది ఆసియా టీ20 కప్ టోర్నీలో రోహిత్ అమీర్ సాధారణ బౌలరే అని పాక్ జట్టులో అతని కంటే మంచి బౌలర్లు ఉన్నారని చెప్పాడు.
అంతేకాదు అమీర్‌పై ఎందుకు హైప్ క్రియేట్ చేస్తున్నారని రోహిత్ అప్పట్లో వ్యాఖ్యానించాడు. తాజాగా ఈ విషయమై అమీర్ స్కై స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడాడు. రోహిత్ శర్మ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడని భావిస్తున్నానని అమీర్ చెప్పాడు.

'ఎవరి అభిప్రాయాలు వారివి.. కానీ ఇతరుల గురించి మాట్లడేటప్పుడు కొంచెం మర్యాదగా వ్యవహరించాలనేదే తన అభిప్రాయం. రోహిత్ శర్మ అంటే నాకు గౌరవం ఉంది. అతనిపై ఎలాంటి కోపం లేదని, అతను ఓ గొప్ప బ్యాట్స్‌మన్' అని అతని రికార్డులే చెబుతాయని అమీర్ పేర్కొన్నాడు.
'మిగతా క్రికెటర్ల పట్ల అతని అభిప్రాయాలు అతనివి. ఇలాంటి విషయాలు పట్టించుకోనని, ప్రస్తుతం నా ఆటపైనే నా దృష్టి అంతా' అని అమీర్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత బ్యాటింగ్ టాపార్డర్‌ను అమీర్ కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.
ఫైనల్లో తొలి 10 ఓవర్లలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీలను పెవిలియన్‌కు చేర్చి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.