హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లోనే ఎంతో గొప్ప టెస్టు సిరిస్‌గా యాషెస్ సిరిస్‌ను పేర్కొంటారు. అలాంటి యాషెస్ టెస్టు సిరిస్ కోసం ఓ వీడియో గేమ్‌ని రూపొందిస్తున్నారు. ఈ వీడియో గేమ్ షూటింగ్ కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రికెట్ లెజెండ్‌లను అనుకరించి చూపించాడు.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా క్రికెటర్ల హావభావాలను, బ్యాటింగ్ శైలులను రికార్డు చేయడంలో భాగంగా మ్యాక్స్‌వెల్ వారిని అనుకరించి చూపించాడు. ఈ షూటింగ్‌లో భాగంగా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ శైలిని కూడా గ్లెన్ మ్యాక్స్‌వెల్ అనుకరించడం విశేషం.
హాఫ్ సెంచరీ లేదా వికెట్లు తీసి ఆనందంలో రవీంద్ర జడేజా బ్యాట్‌ని ఎలాగైనా కత్తి మాదిరి తిప్పుతాడో సరిగ్గా అలానే మ్యాక్స్‌వెల్ చేసి చూపించాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ చేతి నుంచి బ్యాట్ చేజారి కిందపడిపోయింది. మరి కొంతమంది ప్రముఖ బ్యాట్స్‌మెన్ల ప్రత్యేక శైలిని కూడా మ్యాక్స్‌వెల్ అనుకరించారు.
వీరిలో స్టీవ్ స్మిత్ షాట్, వీరేంద్ర సెహ్వాగ్ షాట్, బ్రియాన్ లారా పుల్, మాథ్యూ హెడెన్ చార్జింగ్ షాట్, తిలకరత్న దిల్షాన్ దిల్‌స్కూప్ షాట్లు కూడా ఉన్నాయి. వీడియో గేమ్‌కి ప్రచారం కల్పించడంలో భాగంగా యాషెస్ క్రికెట్ వారు ఈ వీడియో విడుదల చేశారు.