భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కీలక పాత్ర పోషిస్తాడని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాలో పంత్ ఆటకు వీరాభిమానులు ఉన్నారని పేర్కొన్నాడు. సియెట్ అవార్డుల ప్రదానోత్సంలో హెడెన్.. గబ్బా టెస్టు హీరో పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
''రిషభ్ పంత్ వంటి కుర్రాళ్లకు కండరాల జ్ఞాపకశక్తి, విజయ దాహం ఉంది. చివరి ఆస్ట్రేలియా పర్యటనలో అతనే కీలక ఆటగాడు. అతను ఆడే విధానం చూసి ఆస్ట్రేలియా ప్రజలకు కూడా పంత్‌ను ఇష్టపడ్డారు. అతని ఆట ఉత్తేజపరిచేలా, వినూత్నంగా ఉంటాయి. ఈసారి మరింత తాజాగా, గొప్పగా ఉంటుంది''

''ఇక సీనియర్లు కూడా ఈసారి వస్తున్నారు. విరాట్ కోహ్లి తనదైన ముద్ర వేయాలనుకుంటాడు. బ్యాటింగ్ పరంగా.. ఆస్ట్రేలియా పరిస్థితులను ఎదుర్కోవడానికి టీమిండియా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడటానికి ఆసక్తికరంగా ఉన్నాను'' అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌట్, గాయాలతో సీనియర్లు దూరమైనా.. యువ ప్లేయర్లు గొప్పగా పోరాడి సిరీస్‌ను గెలిచారు.
గబ్బా టెస్టులో పంత్ ఛేజింగ్ చరిత్రలో నిలిచింది. కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను టీమిండియానే కైవసం చేసుకుంది. అంతేగాక 2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది.
