
హైదరాబాద్: తన సంచలన ప్రదర్శనతో టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో విఫలం కావడంపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ స్పందించాడు.
భారత్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్టులో రషీద్ ఖాన్ వైఫల్యం చెందడానికి గల కారణాన్ని వెల్లడించాడు. "టెస్టు క్రికెట్ అనేది సుదీర్ఘ పార్మాట్. ఈ ఫార్మాట్‌లో ముందుగా పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది" అని అన్నాడు.
"ముఖ్యంగా సాంప్రదాయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి చాలా ఓర్పు కావాలి. ఇక్కడ మొదటి రోజు నుంచి బౌలింగ్‌తో ఎటాక్ చేయడం సరికాదు. ఎప్పుడైతే బంతిని రషీద్ అందుకున్నాడో ఆ క్షణమే దూకుడుగా బౌలింగ్ చేసే ప‍్రయత్నం చేశాడు. అందులోనూ రషీద్‌కు తొలి టెస్టు పిచ్" అని తెలిపాడు.
"అటువంటప్పుడు సాంప్రదాయరీతిలో బౌలింగ్‌ను ఆరంభిస్తే బాగుండేది. దూకుడుతో కూడిన బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నాడు" అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లు వేసిన ఈ అప్ఘాన్ స్పిన్నర్ 154 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఆప్ఘన్ జట్టు టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా రషీద్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డ్ పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ పేరిట ఉండేది. పాకిస్థాన్ 1952లో భారత్‌పై టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో అమీర్ 134 పరుగులు ఇవ్వగా.. రషీద్.. అంత కంటే ఎక్కువ పరుగులిచ్చాడు.