
హైదరాబాద్: రికార్డుల రారాజు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో ధోనీ 10వేల పరుగుల మార్క్‌ను చేరుకునేందుకు ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మహీ ఇన్‌క్రెడిబుల్ ఫీట్‌ను చేరుకునే గొప్ప అవకాశం వచ్చింది.
ధోనీ 33 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తర్వాత 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రపంచ క్రికెట్లో మొత్తంగా ఈ క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ధోనీ ఈ ఘనత సాధించనున్నాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తొలి వన్డేలో భారత్ తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 268 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ధోనీ మరో ఘనత అందుకోనున్నాడు.
ఇంతకుముందు..:
ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్ సచిన్ వన్డేల్లో 18,426 పరుగులతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(14,234), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13,704), శ్రీలంక ఆటగాళ్లు సనత్ జయసూర్య(13,430), మహేల జయవర్దనే(12,650), పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ హుల్ హక్(11,739), సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కలీస్(11,579), గంగూలీ(11,363), ద్రవిడ్(10,889), బ్రియన్ లారా(10405), శ్రీలంక ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్(10,290) ఈ జాబితాలో ఉన్నారు. సంగక్కర తరువాత ఈ 10వేల మార్క్‌ను అందుకున్న రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోనీ అరుదైన జాబితాలో చేరిపోనున్నాడు.
ఈ 50ఓవర్లు ఫార్మాట్‌లో ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో 2011 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలోనే 2007లో టీ20 ప్రపంచ కప్‌ను కూడా భారత్ సాధించగలిగింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోనీ అదే గడ్డపై 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని సైతం సాధించుకుంది.