దేశ రాజధాని ఢిల్లీని సోమవారం సాయంత్రం ఓ భారీ పేలుడు ఘటన కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా దాదాపు 9 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన జరిగిన కొద్ది దూరంలోనే అరుణ్ జైట్లీ స్టేడియం ఉంది. ఈ స్టేడియంలో ప్రస్తుతం ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్-డి మ్యాచ్ చివరి రోజు(నవంబర్ 11) సందర్భంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.
భద్రతా చర్యలు కట్టుదిట్టం
ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడు సంఘటనతో స్థానిక భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో మ్యాచ్ చివరి రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(DDCA) వేగంగా స్పందించింది. డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. "ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ చివరి రోజున స్టేడియం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించాం" అని తెలిపారు. ఆయన ఢిల్లీ పోలీసు అధికారులను సంప్రదించి స్టేడియం బయట.. ముఖ్యంగా రంజీ మ్యాచ్ వంటి కీలక సమయంలో అదనపు భద్రతా బలగాలను మోహరించాలని అభ్యర్థించారు.

పేలుడు స్థలం స్టేడియానికి కొద్ది దూరంలోనే ఉండటం.. ముఖ్యంగా జమ్మూ-కశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతం నుంచి వచ్చిన జట్టు ఇక్కడ ఆడుతుండటం కారణంగా ఈ భద్రతా పెంపు అనివార్యమైంది.
ఎర్రకోట వద్ద పేలుడు వివరాలు ఇలా..
సోమవారం సాయంత్రం రద్దీగా ఉండే వేళ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కారులో ఈ పెను పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న అనేక వాహనాలు కాలిపోయాయి. యంత్రం వేళ ఎక్కువ మంది జన సంచారం ఉండే సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది.అధికారిక సమాచారం ప్రకారం.. దుర్ఘటనలో 9 మంది మరణించగా, 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన ఢిల్లీ నగరంలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది.
ఉత్కంఠగా సాగుతున్న రంజీ ట్రోఫీ పోరు
ఒకవైపు భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ ఉత్కంఠగా నాలుగో రోజులోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 211 పరుగులు చేసింది. జమ్మూ-కశ్మీర్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది
రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 277 పరుగులు చేసి జమ్మూ-కశ్మీర్‌కు 179 పరుగుల లక్ష్యం ఇచ్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ-కశ్మీర్ స్కోరు 2 వికెట్లకు 55 పరుగులు. చివరి రోజున విజయం సాధించడానికి వారికి ఇంకా 124 పరుగులు అవసరం.