హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే కాన్పూర్ వేదికగా ఆదివారం జరగనుంది. దీంతో ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకున్నాయి. రెండో వన్డే ముగిసిన అనంతరం పూణె నుంచి కాన్పూర్‌కు ఒకే విమానంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో కలిసి దిగిన సెల్ఫీని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బుమ్రా, పాండ్యాతో కలిసి తదుపరి మ్యాచ్ కోసం ప్రయాణిస్తున్నా. హార్దిక్ పాండ్యా హెయిర్ స్టైల్ గురించి ఆలోచిస్తున్నా' అంటూ కామెంట్ కూడా పోస్టు చేశాడు. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. 'పాండ్యకు కొత్త హెయిల్ స్టైల్ బాగా కలిసి వచ్చిందని' కొందరు చెప్పగా, మరికొందరు 'పాండ్యా జుట్టును ఎలుక కొరికివేసిందని' కామెంట్స్ పెట్టారు.
ఇదిలా ఉంటే కాన్పూర్‌కు చేరుకున్న అనంతరం శిఖర్ ధావన్, పాండ్యతో కలిసి దిగిన ఫొటోను టీమిండియా కెప్టెన్ అభిమానులతో పంచుకున్నాడు. కాన్పూర్‌లో వాతావరణం చాలా బాగుందని కోహ్లీ కామెంట్ పెట్టాడు. మరోవైపు పాండ్యా కూడా అదే ఫొటోను షేర్ చేసి 'ఒంటరిగా ఉంటే కొంత మాత్రమే సాధించగలం. అదే కలిసి ఉంటే ఎక్కువ సాధించొచ్చు' అని అన్నాడు.
కాగా, మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెర్ మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.