
హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ మరోసారి తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో గప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం నార్తాంప్టన్‌షైర్, వర్సెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో వర్సెస్టర్‌షైర్ తరపున బరిలోకి దిగిన గప్టిల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఫలితంగా మొత్తంగా టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.
35 బంతుల్లో టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ(భారత్), లూయిస్ వాన్‌డెర్(నమీబియా)లు ఉన్నారు. కాగా, నార్తాంప్టన్‌షైర్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మార్టిన్ గప్టిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.

జట్టు స్కోరు 162 పరుగుల వద్ద ఉండగా గప్టిల్(102: 38 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ జో క్లార్క్(61; 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో వర్సెస్టర్‌షైర్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.