
సిడ్నీ: కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సీఏ దృష్టంతా భారత్‌పైనే ఉంది. కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉన్నప్పటికీ.. అక్కడ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అంతా సద్దుమణిగి క్రీడా టోర్నీలో కూడా ఆరంభమైతే కొన్ని బోర్డులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నసీఏ మళ్లీ గాడిన పడాలంటే.. భారత్ పర్యటన ఒక్కటే మార్గమంటున్నారు ఆ దేశ క్రికెటర్లు.
భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తే ఆర్థికంగా ఏర్పడ్డ నష్టాలను సీఏ పూడ్చుకోగలుగుతుందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ఇటీవలే పేర్కొనగా.. తాజాగా ఆ దేశ యువ స్ సంచలనం మార్నస్ లబుషేన్ ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నిర్ణీత షెడ్యూల్‌లో భారత జట్టు పర్యటనకు రాకపోతే.. అది ఆర్థికపరమైన వినాశానికి దారి తీస్తుందన్నాడు. 'నిర్బంధం ఆస్ట్రేలియాలో బాగా పనిచేసింది. ఇక్కడ కరోనా కేసుల సంఖ్యను చాలా తక్కువగా ఉన్నాయి. పరిమిత సంఖ్యలో మరణాలు ఉన్నాయి' అని లబుషేన్ అన్నాడు.
'మరో 3నుంచి 4 నెలల్లో కానీ 4 నుంచి 5 నెలల్లో కానీ అంతా చక్కబడుతుంది. ఒకవేళ అదే జరిగితే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ కచ్చితంగా వస్తుంది. ప్రతిదీ చాలా త్వరగా మారుతోంది కాబట్టి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ నిర్ణీత షెడ్యూల్‌లో భారత జట్టు పర్యటనకు రాకపోతే అది ఆర్థికపరమైన వినాశానికి దారి తీస్తుంది. ఈ టోర్నీ జరగకపోతే నాతో పాటు జట్టుకు దేశానికి కూడా తీవ్ర నష్టమే' అని లబూషేన్ వెల్లడించాడు. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 6,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతి చెందిన వారి సంఖ్య వంద కంటే తక్కువే.
ఇటీవల టిమ్ పైన్ మాట్లాడుతూ.. టీమిండియా పర్యటనపై తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తమ కష్టాలకు భారత పర్యటనతో ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని పైన్ అన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ రాకపోతే 250 నుంచి 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా-ప్రభుత్వం మధ్య ఇప్పటికే చర్చలు నడిచాయన్నాడు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కొన్ని ఆంక్షల్ని సడలించడమే కాకుండా, చార్టెడ్ విమానాలు, ఐసోలేషన్ వంటివి టీమిండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకం ఏర్పాటు చేస్తుందన్నాడు.
సంక్షోభం నుంచి బయటపడటం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా జూన్ వరకు కొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలిగిస్తున్నామని సీఏ ప్రకటించింది. అయితే అప్పటివరకు వారి ఉపాధి కోసం తమ స్పాన్సర్లలో ఒకరైన ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కెవిన్ రాబర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపారు.