ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో 62రోజుల పాటు ఎన్నో ఉత్కంఠకరమైన మ్యాచ్‌లు జరిగాయి. చివరికి ప్లేఆఫ్ దశకు ఐపీఎల్ చేరుకుంది. ఇప్పుడు కేవలం మూడు జట్లు మాత్రమే మిగిలాయి. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్.. క్వాలిఫయర్ 1లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఇకపోతే శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఒకరు ఈ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని ఎవరు గెలుస్తారు అనేదానిపై ట్విట్టర్లో పోల్ నిర్వహించాడు. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మార్నస్ లబూషేన్.
Who wins the IPL from here? #IPL2022
— Marnus Labuschagne (@marnus3cricket) May 26, 2022
ఇక తన పోల్ రిజల్ట్ చెప్పడానికి ముందు మార్నస్ లబూషేన్ గురువారం ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా తన మద్దతు ఆర్సీబీకే ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే కోహ్లీ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాబోతున్నాయంటూ హింట్ ఇచ్చాడు. ఇక మార్నస్ లబూషేన్ పోల్ ప్రశ్న ఏంటంటే.. #IPL2022 విజేత ఎవరు? అంటూ ట్విట్టర్ పోల్ జరిపాడు. ఇక ఈ పోల్‌లో 60.6 శాతం మంది ఆర్సీబీ గెలుస్తుందని ఓట్ చేయగా.. 20శాతం మంది గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని, 19.4శాతం మంది రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని ఓట్ చేశారు.
RCB - @imVkohli will go big
— Marnus Labuschagne (@marnus3cricket) May 26, 2022
ఇకపోతే 15ఏళ్లుగా ఆర్సీబీని ఐపీఎల్ ట్రోఫీ ఊరిస్తోంది. ఇప్పటికీ ఒక్కసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదిసార్లు ప్లేఆఫ్‌కు చేరిన జట్టుగా, మూడుసార్లు ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా ఆర్సీబీకి మంచి గణాంకాలున్నాయి. ఇకపోతే ఐపీఎల్ 2022సీజన్లో ఆర్సీబీ లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 14పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించి IPLప్లేఆఫ్స్‌లో రెండవ దశకు చేరుకుంది. ఆర్సీబీ ఇంతకుముందు వరుసగా రెండు సీజన్లలో ఎలిమినేటర్ అడ్డంకిని దాటలేకపోయింది, 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 6 వికెట్ల తేడాతో ఓడిపోగా.. 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 4వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈసారి ఎలిమినేటర్ గండం గట్టెక్కినా.. క్వాలిఫయర్ 2లో పటిష్ట రాజస్థాన్ టీంతో ఆ జట్టు తలపడాల్సి వస్తోంది. ఇక ఈసారైనా ఆర్సీబీ కప్ కొడుతుందా లేక ఖాళీ చేతులతో వస్తుందా అనేది చూడాల్సిందే.