ట్రినిడాడ్ : హంతకులతో తనకు సంబంధాలున్నాయంటూ రేడియో కామెంటరీలో తనపై వివాదస్పద ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ లాసన్ పై కోర్టుకెక్కాడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ మార్లోన్ శ్యామ్యూల్స్. తన పరువును భంగం కలిగించేలా జెఫ్ లాసెన్ ఆరోపణలను సవాల్ చేస్తూ, కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిగిన టీ20 ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో.. ఏప్రిల్ 4వ తేదీన 'బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్' అనే రేడియో కార్యక్రమంలో పాల్గొన్న జెఫ్ లాసన్, శ్యామ్యూల్స్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఆ సందర్బంగా శ్యామ్యూల్స్ పై పలు ఆరోపణలు చేస్తూ.. ' శ్యామ్యూల్స్ వెనుక ఎవరున్నారో మీకు తెలియదు..!, వెస్టిండీస్ లోని హంతక ముఠాలతో శామ్యూల్స్ కు సంబంధాలున్నాయి. ప్రపంచంలోనే హత్యల రాజధానిగా పేరొందిన నగరాల్లో ఒకటైన జమైకాలోని కింగ్ స్టన్ నుంచి అతడు వచ్చాడు' అని ఆరోపించడంతో వివాదానికి తెరలేచినట్టయింది.
లాసన్ తో పాటు జర్నలిస్ట్ జేమ్స్ మాథహో పేరును కూడా పరువు నష్టం దావాలో చేర్చిన శ్యామ్యూల్స్.. లాసన్ వ్యాఖ్యలు తన ఇమేజ్ ను మసకబార్చేవిగా ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు. కాగా, వెస్టిండీస్ రెండోసారి ప్రపంచకప్ ను గెలుచుకోవడంలో శ్యామ్యూల్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.