కేప్‌టౌన్ టెస్టుపై చర్చలు మొదలయ్యాయి. అది ప్రమాదకర పిచ్‌గా కొందరు వర్ణిస్తుంటే.. టెస్టు ఫార్మాట్‌కు బ్యాటర్లు అలవాటు పడలేదని మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తంగా కేప్‌టౌన్‌లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా టెస్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్‌గా రికార్డులకెక్కెంది. కేవలం ఒకటిన్నర రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది.
టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేగాక కేప్‌టౌన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌పై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కఠిన పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్‌రమ్ దూకుడుగా ఆడి సెంచరీ చేయడాన్ని సచిన్ మెచ్చుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అదే సరైన విధానమని అన్నాడు.

''సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీమిండియాకు శుభాకాంక్షలు. మార్క్‌రమ్ బ్యాటింగ్ విధానం అద్భుతంగా ఉంది. ఇలాంటి పిచ్‌పై ఎదురుదాడికి దిగుతూ ఆడటమే కొన్నిసార్లు సరైన విధానం. ఇక బుమ్రా గొప్పగా బౌలింగ్ చేశాడు. అలాంటి వికెట్‌పై నిలకడగా ఎలా బౌలింగ్ చేయాలో మనకు చూపించాడు'' అని సచిన్ ట్వీట్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి రోజు ఆటలోనే రికార్డులు బద్దలయ్యాయి. టెస్టులో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదే అత్యుత్తమం.

అయితే 153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్టు స్కోరులో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది. కాగా, ఓవర్ నైట్ స్కోరు 62/3తో రెండో రోజ ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా (6/61) సఫారీ సేనను భయపెట్టాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి మార్క్‌రమ్ దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన మార్క్‌రమ్ 99 బంతుల్లో శతకం అందుకున్నాడు.