
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయడం లేదని మంగళవారం స్పష్టం అయింది. ఏబీ పునరాగమనం చేయట్లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) కూడా అధికారికంగా ప్రకటించింది. భారత్ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ద్వారా ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో.. మిస్టర్ 360 నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ తేల్చి చెప్పాడు.
దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్న ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు. అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. అతని మాజీ సహచరులు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను తోసి పుచ్చుతూ సీఎస్‌ఏ చేసిన ప్రకటనతో డివిలియర్స్ కెరీర్ ముగిసినట్లు స్పష్టమైపోయింది.
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఛాన్స్ ఇచ్చినా ఏబీ డివిలియర్స్ వెనక్కి తగ్గడం వెనుక కారణమేంటని అందరి మెదడును తొలుస్తున్న ప్రశ్న. ఏబీని మొదట రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకునేలా ఒప్పించిన దక్షిణాఫ్రికా టీమ్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.. అతడి మనసు మార్చుకోవడంపై తాజాగా స్పందించాడు. 'ఏబీ విషయంలో ఇది నిజంగా దురదృష్టకరం. 2018లో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవించాం. కానీ తనకు మళ్లీ ఆడాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. జట్టులోకి అతని పునరాగమనం కోసం బోర్డు సభ్యులతో చాలా సార్లు చర్చించాం. కానీ అనూహ్యంగా కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాను ఇక జట్టులోకి రాకపోవచ్చు అనే సంకేతాలు ఏబీ బోర్డుకు పంపించడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయింది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం' అని అన్నాడు.
'ఏబీ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ టీ20ల్లో బెస్ట్ ఫినిషర్‌గా నిలుస్తూ వచ్చాడు. అందుకు ఐపీఎల్ మంచి ఉదాహరణ. ఒక బోర్డులో సభ్యునిగా ఉత్తమంగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చే బాధ్యత నాపై ఉంది. ఏబీ విషయంలో కూడా అదే భావించాను. అతను జట్టులో ఉంటే ఆటగాళ్లకు మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ ఏబీ నిర్ణయాన్ని మేం గౌరవించాల్సిందే. ఇక ఈ విషయాన్ని మరిచిపోయి ముందుకు సాగుదాం' అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. డివిలియర్స్ 2004లో టెస్టు మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 15 ఏళ్ల కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9557, 78 టీ20ల్లో 1672 పరుగులు సాధించాడు.