ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు అడిగారు: మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్ధానికి పైగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పతనం తర్వాత ఆ పార్టీలోని అంతర్గత చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మాజీ క్రికెటర్, మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మనోజ్ తివారీ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన నియోజకవర్గమైన షిబ్‌పూర్ నుంచి ఈ సారి టికెట్ నిరాకరించడం వెనుక అసలు కారణం డబ్బేనని తేల్చి చెప్పారు. పార్టీతో తన బంధం పూర్తిగా తెగిపోయిందని.. ఇకపై టీఎంసీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
టికెట్ల అమ్మకంపై సంచలన నిజాలు
మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన ఆరోపణలు బెంగాల్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ అధిష్ఠానం టికెట్లను బహిరంగంగా అమ్ముకుందని ఆయన ఆరోపించారు. "ఈ దఫా ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు సుమారు రూ. 5 కోట్లు చెల్లించి టికెట్లు దక్కించుకున్నారు. నన్ను కూడా అదే మొత్తం అడిగారు, కానీ అక్రమంగా డబ్బులు ఇచ్చి పోటీ చేయడం ఇష్టం లేక నేను నిరాకరించాను. అందుకే నాకు టికెట్ ఇవ్వలేదు" అని మనోజ్ తివారీ ఆరోపించారు. అవినీతి పునాదుల మీద నడుస్తున్న పార్టీ కాబట్టే ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెప్పారని ఆయన విశ్లేషించారు.

లాలిపాప్ లాంటి మంత్రి పదవి
మంత్రిగా తన అనుభవాలను వివరిస్తూ మనోజ్ తివారీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రీడల శాఖ సహాయ మంత్రి పదవి కేవలం పేరుకే తప్ప, తనకు ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని ఆయన వాపోయారు. "మంత్రి పదవి నాకు ఓ లాలిపాప్ లాంటిది. కేబినెట్ సమావేశాల్లో ఏదైనా సమస్య గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తే.. మమతా బెనర్జీ మధ్యలోనే అడ్డుకుని..మీలాంటి వారికి కేటాయించేంత సమయం నాకు లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారు" అని మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని ఆయన విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు.. సొంత డబ్బుతో పనులు
తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ పార్టీ నేతలు తనను ఇబ్బంది పెట్టారని మనోజ్ తివారీ ఆరోపించారు. హౌరా మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. స్థానిక కౌన్సిలర్లు, ఇతర నేతలు అడ్డుపడేవారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కొన్ని సందర్భాల్లో తన సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయించానని ఆయన పేర్కొన్నారు. ఏటా మమతా బెనర్జీ ప్రకటించే 'మాస్టర్ ప్లాన్‌లు' కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని.. క్షేత్రస్థాయిలో మార్పు సున్నా అని ఆయన విమర్శించారు.
వసూళ్ల ఆరోపణలకు కౌంటర్.. కొత్త ఇన్నింగ్స్
తనపై వచ్చిన వసూళ్ల ఆరోపణలను మనోజ్ తివారీ గట్టిగా తిప్పికొట్టారు. "నేను పదేళ్ల పాటు ఐపీఎల్ ఆడాను, 20 ఏళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. నా దగ్గర ఇప్పటికే రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. నాకు ఎవరి దగ్గరో వసూళ్లు చేయాల్సిన కర్మ పట్టలేదు" అని ధీటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాజకీయాలకు స్వస్తి పలికిన మనోజ్ తివారీ.. మళ్లీ క్రికెట్ వైపు మళ్ళారు. బీసీసీఐ లెవల్-2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆయన.. బెంగాల్ రంజీ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తున్నారు. తన తదుపరి జీవితం క్రికెట్ అభివృద్ధి కోసమేనని ఆయన ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications