భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీలను వన్డే ఫార్మట్ నుంచి కూడా తప్పించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. 2027 వరల్డ్ కప్ వరకూ ఆడాలనుకుంటోన్న వారిద్దరి ఆశలపై నీళ్లు చల్లడం దాదాపుగా ఖాయమైంది. పొమ్మనలేక పొగబెట్టిందనే వాదనలు వినిపిస్తోన్నాయి.
దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే బ్రాంకో టెస్ట్ ను ఇంట్రడ్యూస్ చేసింది బీసీసీఐ. ఫిజికల్ చాలా క్లిష్టమైన టెస్ట్ ఇది. ఫాస్ట్ బౌలర్లలో ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ టెస్ట్ ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్ స్థాయిని పెంచడం, మరీ ముఖ్యంగా ఏరోబిక్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

దీన్ని అడ్డుగా పెట్టుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వన్డే ఫార్మట్ నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ వయస్సు 40 సంవత్సరాలు దాటేస్తాయి. 40 ఏళ్లు దాటిన ఓ ప్లేయర్ బ్రాంకో టెస్ట్ లో పాస్ కావడం అసాధ్యమనే అభిప్రాయాలు ఉన్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇదే అంశంపై మాట్లాడారు. రోహిత్ శర్మను 2027 ప్రపంచకప్‌కు ముందే రిటైర్ చేయించడానికే బీసీసీఐ ఈ బ్రాంకో టెస్ట్ ను ప్రవేశపెట్టిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని చాలా మందికి తెలుసునని, అయినప్పటికీ అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా బెంచ్ కే పరిమితం చేయడం బీసీసీఐ సాధ్యపడట్లేదని చెప్పాడు.
2027 ప్రపంచకప్ ప్లానింగ్ నుండి విరాట్ కోహ్లీని దూరం చేయడం చాలా కష్టమని, అదే సమయంలో ఫిట్ నెస్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను తప్పించడం సులువు అవుతుందని బీసీసీఐ భావిస్తోందని మనోజ్ తివారీ పేర్కొన్నాడు. ఈ బ్రోంకో టెస్ట్ రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ల కోసమేనని, భవిష్యత్తులో జట్టులో వారు ఉండకూడదని బీసీసీఐ భావిస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నాడు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ క్లిష్టమైన టెస్ట్ ను ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టారని మనోజ్ తివారీ ప్రశ్నించాడు. దీని వెనుక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది అందుబాటులోకి వచ్చిందని వ్యాఖ్యానించాడు.
2011 వన్డే ప్రపంచకప్ తర్వాత ఫిట్‌నెస్ కారణంగా సీనియర్ ఆటగాళ్లను ఎలా పక్కన పెట్టారో, ఇప్పుడు కూడా అలాంటిదే జరగవచ్చని మనోజ్ తివారీ తేల్చి చెప్పాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫిట్‌నెస్ కారణంగా అతన్ని ప్రశ్నించలేకపోవచ్చని, రోహిత్ బ్రోంకో టెస్ట్‌ను తట్టుకోగలడని తాను అనుకోవట్లేదని చెప్పాడు.
గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ వంటి దిగ్గజాలు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు యో-యో టెస్ట్ ఎలా తెరపైకి వచ్చిందో, అలాగే కొంతమంది ఆటగాళ్లను దూరం చేయడానికి ఇప్పుడు బ్రాంకో టెస్ట్ ను ప్రవేశపెట్టారని తాను బలంగా విశ్వసిస్తున్నానని మనోజ్ తివారీ స్పష్టం చేశాడు.